ఎన్నికల వేళ తెలంగాణలో అసంతృప్తుల జ్వాల రగులుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీని వీడి వలస వెళ్తున్నారు. తాజాగా ఇదే బాటలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన నాగం జనార్థన్‌రెడ్డి త్వరలో బీఆర్‌ఎస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఆయన మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా టికెట్ విషయంలో కాంగ్రెస్ తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల రణరంగంలో తొలుత బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో గులాబీ అసంతృప్తుల రగడ రాజుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఫస్ట్, సెకండ్ లిస్టు ప్రకటించడంతో హస్తంలోనూ ఆశవహులు జంపింగ్ బాట పట్టారు. ఇక తాజాగా నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్థన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకి పంపారు. దశాబ్దాలపాటు విలువలతో కూడిన రాజకీయాలు చేశానని.. ఇక ఇమడలేక పార్టీని వీడుతున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. అధిష్టానం తన శ్రమను గుర్తించలేదన్న ఆయన.. టికెట్ ఇవ్వపోవడంపై ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కొడుకు రాజేశ్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇక రాజీనామా అనంతరం నాగం ఇంటికి మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించి.. ప్రగతిభవన్‌కు తీసుకువచ్చారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఆయన.. హస్తం పార్టీ తనకు టికెట్ కేటాయించకుండా మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానం జరిగిందని.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయన్నారు నాగం జనార్థన్‌రెడ్డి. ఈ సందర్భంగా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే… తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్న నాగంను ప్రజలు ఆదరిస్తారా అన్నది ఆసక్తి రేపుతుంది
కాగా.. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ వచ్చింది మొదలు ఇప్పటి వరకూ చాలామంది కీలక నేతలు టికెట్లు రాకపోవడంతో.. పార్టీలు మారాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, బీజేపీ పార్టీలోకి అనేకమంది నేతలు చేరారు. త్రిముఖ పోరు నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత మేరకు మెజారిటీ వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పలు సర్వేల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని చెబుతున్నా.. చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చని రాజకీయ పండితులంటున్నారు.