ఇప్పటి వరకు ఉన్న మోబైల్ ఫోన్లు నెట్ వర్క్ ఉంటేనే పని చేసేలా రూపొందించబడ్డాయి. కాల్స్ మాట్లాడాలన్నా, మెసేజ్ లు రావాలన్నా, మ్యాప్స్ చూడాలన్నా కచ్చితంగా సిగ్నల్స్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు టెక్ ప్రపంచంలో సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది ఆపిల్. నెట్ వర్క్ లేకుండా ఐఫోన్లు పని చేయడానికి అనుమతించే సరికొత్త శాటిలైట్ ఆధారిత ఫీచర్ల మీద పని చేస్తోంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి బ్లూమ్ బెర్గ్ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. ఆపిల్ కంపెనీ మ్యాప్స్, మెసేజ్ లకు శాటిలైట్ కనెక్టివిటీని తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు సిగ్నల్ లేని ప్రాంతాలలో కూడా నావిగేషన్ తో పాటు చాట్ చేసే సదుపాయం పొందనున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఐఫోన్లను మరింత ఉపయోగకరంగా మార్చాలనే ఆలోచనతో ఆపిల్ ఈ ప్రయోగాలు చేస్తోంది. ఆపిల్ ఇప్పటికే శాటిలైట్ ద్వారా అత్యవసర SOSను అందిస్తోంది. ఇది సిగ్నల్స్ లేని సమయంలో వినియోగదారులు రెస్క్యూ బృందాలను సంప్రదించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధానం 2022లో ఐఫోన్ 14తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు, ఆపిల్ మ్యాప్స్, మెసేజ్ లు లాంటి రోజువారీ టూల్స్ ను ఆఫ్ గ్రిడ్ లో కూడా పని చేసేలా రూపొందించాలనుకుంటుంది.
ఇందుకోసం ఆపిల్ ఇన్ బిల్ట్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఐఫోన్లను నేరుగా ఉపగ్రహాలకు కనెక్ట్ చేసే కొత్త సాంకేతికతను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరిశోధక బృందం ఆపిల్ SOS ఫీచర్లకు సహకరించే శాటిలైట్ ఆపరేటర్ గ్లోబల్ స్టార్ తో కలిసి పని చేస్తుంది. గ్లోబల్ స్టార్ వ్యవస్థ స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ లాంటి ప్రత్యర్థుల వ్యవస్థ అంత పెద్దది కాకపోయినా, ఆపిల్ ప్రస్తుత సేవలకు ఇది సరిపోతుంది. భవిష్యత్ ఫీచర్లకు సపోర్ట్ చేయడానికి గ్లోబల్ స్టార్ నెట్‌వర్క్ అప్ గ్రేడ్ లకు కంపెనీ నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించింది. రాబోయే జెనరేషన్ ఐఫోన్లలో 5G NTN (నాన్ టెరెస్ట్రియల్ నెట్‌వర్క్స్) సపోర్టు కూడా ఉండవచ్చు. ఇది మొబైల్ టవర్లు, ఉపగ్రహాలను కలిపి బలమైన, విస్తృత కవరేజీని అందిస్తుంది.
Read Also: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?
అటు ఆపిల్ శాటిలైట్ ఉపగ్రహ విస్తరణ అక్కడితో ఆగదు. యాప్ డెవలపర్ల కోసం కంపెనీ ఒక ఫ్రేమ్‌వర్క్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా థర్డ్ పార్టీ యాప్స్ శాటిలైట్ కనెక్షన్లను ఉపయోగించుకునే అవకాశం కల్పించబోతోంది. ప్రయాణం, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన యాప్‌లు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పని చేస్తాయి. ఒకేవేళ ఈ విధానం అమల్లోకి వస్తే దేశంలోని గ్రామీణ ప్రాంతాలతో సహా నెట్ వర్క్ కనెక్టివిటీ తరచుగా తగ్గే ప్రాంతాలలో ఆపిల్ ఫోన్లు చక్కగా పని చేసే అవకాశం ఉంటుంది.
Read Also: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గూగుల్ జెమిని ప్రో ఫ్రీగా వాడుకోవచ్చు!