2023 అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎంత కాన్ఫిడెన్స్ తో కనపడిందో అందరికీ తెలుసు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం గా రికార్డ్ సృష్టిస్తారని అన్నారు. కేటీఆర్ సహా అందరు నేతలు అదే కాన్ఫిడెన్స్ తో ఉండి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ఏడాదికి వచ్చిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలోల కూడా అదే కాన్ఫిడెన్స్ తో ప్రచారం చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పై అప్పటికే ప్రజల్లో విముఖత వచ్చిందని, ప్రజలంతా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్కోర్ జీరో. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేటీఆర్ అదే మాట చెబుతున్నారు. బరాబర్ బీఆర్ఎస్ గెలుస్తుందని సెలవిచ్చారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఆ పార్టీ ఓడిపోతుందనేది సర్వేల సారాంశం.
ఆమాత్రం చేయకపోతే జనం గుర్తించరా?
మేం చేసిన మంచిని చూసి ఓటు వేయండి అనడం పాత పద్ధతి, ఆరు నూరైనా ఈ ఎన్నికల్లో గెలుపు మాదే అనడం కొత్త పద్ధతి. గెలుపుపై అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇక ప్రచారం ఎందుకు? గల్లీ గల్లీ తిరిగి మీటింగ్ లు పెట్టడం దేనికి? స్టేజ్ పై సెంటిమెంట్ సీన్లు దేనికి? ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో బొక్కబోర్లా పడటం ఇటీవల సర్వ సాధారణంగా మారింది. ఈసారి కూడా అదే జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు. విజయంపై కేటీఆర్ అంత ధీమాగా ప్రకటనలు చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నా, సామాన్య ఓటరు మదిలో ఏముందో ఎవరికీ తెలియదనేది మాత్రం వాస్తవం.
సెల్ఫ్ ఎలివేషన్లు..
జూబ్లీ హిల్స్ గడ్డమీద దుమ్మురేపిన గులాబి దండు అంటూ కేటీఆర్ కి ఎలివేషన్లు ఎక్కువయ్యాయి. అభ్యర్థి మాగంటి సునీత గురించి జరిగిన ప్రచారం తక్కువ, కేటీఆర్ కి పార్టీ ఇచ్చిన ఎలివేషన్లు ఎక్కువ అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. తమ అభ్యర్థిని చూసి ఓటు వేయాలని, ఆమె భర్త చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎక్కడా కేటీఆర్ ప్రస్తావించలేదు. మీరు బీఆర్ఎస్ ని గెలిపిస్తే మరికొన్ని రోజుల్లో కేసీఆర్ సీఎంగా వస్తారంటూ ఊదరగొట్టారు కేటీఆర్. అసలు కేసీఆర్ సీఎం కావడానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధం ఏంటి? లేకపోయినా సరే కేసీఆర్ పేరు వాడుకోడానికి, ఆయన సీఎం కావాలంటూ ప్రజల్ని మోటివేట్ చేసేందుకు కేటీఆర్ బాగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ గడ్డ మీద దుమ్మురేపిన గులాబీ దండు 💥
రెండేండ్ల విధ్వంస బుల్డోజర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి..
మాగంటి సునీతమ్మకు మద్దతుగా కదిలిన కేసీఆర్ సైనికులు ✊కారు గుర్తుకే ఓటేద్దాం.. 🚘
తెలంగాణను కాపాడుకుందాం.#RAMpage#JubileeHillsWithBRS#VoteForCar… pic.twitter.com/CzRHYVSpT9— BRS Party (@BRSparty) November 10, 2025
ఎదురు దెబ్బలు తగిలినా మారరా?
2023 నుంచి బీఆర్ఎస్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చి, ఢిల్లీ గద్దెపై దృష్టిసారించినప్పటి నుంచి బీఆర్ఎస్ ని ప్రజలు ఖాతరు చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే లోక్ సభ ఎన్నికల్లో చక్రం తిప్పాలని అనుకున్నారు కేసీఆర్. కానీ ప్రజలు అసెంబ్లీ వద్దే వారికి చెక్ పాయింట్ పెట్టారు, లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా సున్నా చుట్టి అసలు తెలంగాణ నుంచి లోక్ సభలో బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. అయినా కూడా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ చూసి తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు నెటిజన్లు. గతంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఇలానే బీఆర్ఎస్ నేతల ప్రసంగాలు ఉండేవని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిని పక్కనపెట్టుకుని ఈయన గెలిచిపోయినట్టే అంటూ కేసీఆర్ చేసిన ప్రసంగాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పు ఇస్తారని జోస్యం చెబుతున్నారు.
Also Read: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు
Also Read: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు