Gatha Vibhavam Trailer: కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం డైరెక్టర్లు చాలా కష్టాలు పడుతున్నారు. పీరియాడిక్ అని, టైం ట్రావెల్ అని, లవ్ స్టోరీస్ అని.. ఇలా రకరకాల కథలతో వస్తున్నారు. తాజాగా శాండల్ వుడ్ ఏకంగా వీటన్నింటిని ఒకే సినిమాలో చూపించడానికి సిద్దమయ్యింది. అదే గత వైభవం. దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా సుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దీపికా తిమ్మప్ప- సుని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక గత వైభవం సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒకే కథలో ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాలాలు.. నాలుగు ప్రేమ కథలు చూపించారు. పోర్చగీస్ కాలం, దేవలోకం కాలం, రాచరిక కాలం, మోడ్రన్ యుగం. ఇలా ఈ నాలుగు యుగాలలో ఒకటి కావాలనుకునే ప్రేమ జంట.. వారికి ఎదురైన సంఘటనలు చూపించారు. ఈ నాలుగు యుగాలలో ఈ జంట కలిసిందా లేదా అనేది కథగా తెలుస్తోంది.
ఇలాంటి ఒక కథతో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు అని చెప్పొచ్చు. టైమ్ ట్రావెల్ తో వచ్చినా అవి ఒకటి రెండు కాలాలు మాత్రమే. ఇందులో నాలుగు కాలాలు చూపించడం కొత్తగా ఉంది. అందులో ఏ కాలంలో చూసినా హీరో హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఇక విజువల్స్ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఆషికా అందం హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాను తెలుగులో హనుమాన్ సినిమాను నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి రిలీజ్ చేస్తున్నాడు. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ వచ్చాక విచిత్రంగా ఉంది ఇదేదో చూడాలి అనేఆసక్తి ప్రేక్షకులలో కలిగించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.