Rahul Gandhi Yatra : చార్మినార్ ప్రాంతం మువ్వన్నెల కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడింది. చార్మినార్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా.. అనేలా భారీ బల ప్రదర్శన చేసింది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చార్మినార్ దగ్గరికి చేరుకోగానే జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు చార్మినార్ సెంటర్ లో సత్తా చాటారు. గుర్రెలు, ఒంటెలతో ఊరేగింపులో పాల్గొన్నారు. బోనాలు, ఒగ్గు నృత్యాలు, డప్పు చప్పుళ్లతో మారుమోగిపోయింది. చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక స్తూపం మీద జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు రాహుల్ గాంధీ.
చార్మినార్ ప్రాంతం కాంగ్రెస్ శ్రేణులతో, జెండాలతో నిండిపోయింది. డ్రోన్ దృశ్యాలు, ఫోటోలలో జనాలు భారీగా కనిపిస్తున్నారు. వాటిని చూసిన వారంతా.. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ బలప్రదర్శన చేసిందంటున్నారు. గతంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా.. ఇదే చార్మినార్ ప్రాంతంలో కమలనాథులు భారీగా జన సమీకరణ చేశారు. ఆ సమయంలో చార్మినార్ చుట్టు పక్కల ప్రాంతమంతా కాషాయ జెండాలతో నిండిపోయింది. పాతబస్తీలో కాషాయ సత్తా అంటూ.. ఆ ఫోటోలను, వీడియోలను బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. ఎంఐఎంకు సవాల్ విసిరారు. ఇప్పుడు అదే చార్మినార్ చెంత.. అంతే బలంతో కాంగ్రెస్ సైతం సత్తా చాటడం ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. ఎంఐఎం, బీజేపీలకు ధీటుగా హస్తం పార్టీ హంగామా చేసింది.
ఎంఐఎం ఇలాఖా పాతబస్తీ దారుల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. ఆరాంఘర్, తాడ్ బండ్, పురానా పూల్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్.. ఇలా పతంగి పార్టీకి పట్టున్న ప్రాంతం రాహుల్ అడుగుల చప్పుడుతో.. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో హోరెత్తింది. జనం భారీగా తరలివచ్చారు. ఓల్డ్ సిటీ, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెస్ రోడ్ వరకు సాగింది భారత్ జోడో యాత్ర. అందుకే, రాహుల్ గాంధీ పాదయాత్రను జైత్రయాత్ర అంటున్నారు.