Revanth Reddy:తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాలపై తనదైన శైలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.స్కూల్ విద్యార్థుల డ్రెస్‌ల కోసం ప్రభుత్వం చేస్తున్న టెండర్ల ఖర్చు రూ.685 కోట్లు అయితే.. అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని కొందరు చెబుతున్నారని సీఎం అన్నారు.
ఇలా మాట్లాడేవాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో ఐపీఎస్‌లుగా పనిచేసిన వాళ్లు కూడా ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రూ.685 కోట్ల ఖర్చులో రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలంటూ ప్రశ్నించారు.
బర్లు, గొర్రెలు పెంచుకునే దిశగా
ఇక విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో పిల్లలను బర్లు, గొర్రెలు పెంచుకునే దిశగా ప్రోత్సహించారని ఆయన అన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు కావాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థను మార్చుతున్నామని చెప్పారు. పేద పిల్లలకు కూడా మంచి చదువు అందితే వాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయని అన్నారు.
పిల్లల చదువు విషయంలో ధనిక, పేద అనే తేడా ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. మీ పిల్లలు సింగపూర్, అమెరికా లాంటి దేశాల్లో చదువుకోవాలి.. మరి తెలంగాణ రాష్ట్రంలోని పిల్లలు మాత్రం ఇక్కడే సాధారణ విద్యతో సరిపెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా మంచి అవకాశాలు రావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
ఇద్దరి మధ్య పోలిక ఏంటి ?
తన చదువు గురించి కూడా రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. తాను ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్నానని, కేటీఆర్ గుంటూరులో చదువుకున్నారని చెబుతూ.. ఇద్దరి మధ్య పోలిక ఏంటని సంచలన కామెంట్స్ చేశారు.చిన్నప్పటి నుంచే దళిత పిల్లలతో కలిసి చదువుకున్నానని, వాళ్ల కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు తనకు తెలుసని అన్నారు. అందుకే పేదలు, దళితులు, ఆదివాసీల పిల్లలకు మంచి చదువు అందించడంపై తాను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.ఇక మీలాగా మేము పసుపు నీళ్ల తో మేము కడగలేదని ,క్షుద్ర పూజలు చేశారు అంటే ఏమో అనుకున్న ఇదేనేమో అంటూ మనం ఏ యుగం లో ఉన్నామని ప్రశ్నించారు.
ఇదే సమయంలో వ్యక్తిగత విమర్శలకు కూడా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తనను చూసి అసూయ పడేవాళ్లు ఎవరూ లేరని.. కానీ రాష్ట్రంలో తనను చూసి తిట్టుకునే వాళ్లు మాత్రం ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారం పోయినా కొందరిలో అహంకారం మాత్రం తగ్గలేదని విమర్శించారు.
పోలీసుల్లో తన ముఖాన్ని చూసారేమో
పోలీసుల విషయంలో జరిగిన కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ కూడా సీఎం తీవ్రంగా స్పందించారు. పోలీసుల మెడ పట్టుకునే స్థాయిలో కొందరు ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసుల్లో తన ముఖాన్ని చూసుకున్నట్టుగా అనిపించిందేమో.. అందుకే అలా ప్రవర్తించారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
ఇక ఫామ్‌హౌస్ గురించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. . ఫామ్‌హౌస్‌లో ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదించవచ్చో ఇప్పటివరకు ఎవరికీ చెప్పడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తనకు చెప్పకపోయినా పర్లేదని.. కనీసం దళిత, ఆదివాసీ రైతులకు అయినా ఆ పద్ధతి చెప్పాలని అన్నారు. నిజంగానే ఎకరానికి అంత ఆదాయం వచ్చే మార్గం ఉంటే రాష్ట్రంలోని రైతులకు కూడా ఉపయోగపడేలా చేయాలని సూచించారు.
ALSO READ:విద్యాశాఖ నా దగ్గరే ఎందుకు? అసెంబ్లీలో సీఎం చెప్పిన కారణం ఇదే
అంతేకాదు.. తెలంగాణలో విద్యను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. అమెరికాలోని యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశామని తెలిపారు. మన రాష్ట్రంలో చదివే విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.