Fee Reimbursement:ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. అర్హత ఉన్న, రూల్స్ పాటిస్తున్న కాలేజీలకు ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లిస్తామని, ఈ ఏడాది గ్రీన్‌చానల్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ప్రతి కాలేజీకి కళ్లుమూసుకుని డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదని సీఎం స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదని బీఆర్‌ఎస్ నేతలను సీఎం ప్రశ్నించారు. ఇప్పుడు విద్యార్థుల పేరుతో ధర్నాలు చేస్తున్న వారు గతంలో ఇదే సమస్యపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరుగుతున్న ఉద్యమం వెనుక అసలు ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇకపై చెక్ పెట్టాల్సిందే
కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి చివరి సంవత్సరం ఫీజులు పూర్తిగా వసూలు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కూడా తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వ్యవహారాలకు ఇకపై చెక్ పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్ అసలు ఉద్దేశం విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడమే తప్ప, కాలేజీ యాజమాన్యాలకు లాభం చేకూర్చడం కాదని పేర్కొన్నారు.
క్లీన్‌చిట్ ఇచ్చిన కాలేజీలకే రీయింబర్స్‌మెంట్
అర్హత ఉన్న జెన్యూన్ కాలేజీలకు తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి కాలేజీని పరిశీలించి, అక్కడి పరిస్థితులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విజిలెన్స్ అధికారులు విచారణ చేసి క్లీన్‌చిట్ ఇచ్చిన కాలేజీలకే రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన కాలేజీలపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే సందర్భంలో ఓ మాజీ మంత్రి, రాజకీయ నాయకుడికి సంబంధించిన విద్యాసంస్థకు గత ప్రభుత్వం నుంచి దాదాపు రూ.400 కోట్ల బకాయిలు ఉన్నాయనే అంశాన్ని లేవనెత్తారు. ఆ స్థాయిలో ఆస్తులు, డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. “పాలు, పూలు అమ్మితే వందల కోట్లు వస్తాయని నాకు తెలియదు” అంటూ సెటైర్లు వేశారు
విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులను తప్పుదోవ పట్టించవద్దని సీఎం సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో రీయింబర్స్‌మెంట్ నిధులు మరింత పారదర్శకంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సూచించిన రూల్స్ ని కూడా పాటిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే నడుస్తున్నామని రామచంద్రరావును ఉద్దేశించి చెప్పారు. కేంద్ర నిబంధనలు పాటించడం లేదంటూ విమర్శలు చేయడం కంటే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు.
కేసీఆర్ చట్టం, గౌతమ్ రావు చెప్పారంటూ ధర్నాలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ అంశంగా మార్చకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని, అయితే అర్హత ఉన్నవారికి మాత్రమే నిధులు అందేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు.
బంగారు గొలుసు కొట్టేస్తాడనే భయంతోనే
ఇక తనని ప్రతీసారి ఢిల్లీకి వెళ్తున్నారని కామెంట్ చేస్తున్నారని ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు తీసుకురావడానికే వెళ్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తానని, ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక హరీష్ రావ్ గురించి మాట్లాడుతూ “వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసల అగ్గిపెట్టె తెచ్చుకోలేదు” అంటూ చేసిన కామెంట్స్ అక్కడున్న వారిలో నవ్వులు పూయించాయి. అలాగే ధర్నా సమయంలో హరీష్ రావ్ టీషర్ట్ తీసి పక్కన పెట్టడంతో పాటు బంగారు గొలుసును జేబులో పెట్టుకున్న విషయాన్ని కూడా సీఎం గుర్తుచేశారు. బామ్మర్ది బంగారు గొలుసు కొట్టేస్తాడనే భయంతోనే దాన్ని జేబులో పెట్టుకున్నాడంటూ సీయం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ALSO READ:పసుపు నీళ్లతో కడిగారా? క్షుద్ర పూజలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మొత్తంగా విద్యార్థుల చదువు ఆగకుండా చూడటమే తమ ఉద్దేశమని, అదే సమయంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.