Telangana Slang in Telugu Cinema: ఒకప్పుడు తెలంగాణ యాస వినిపిస్తే చాలు.. సినిమాల్లో ఎక్కువగా కామెడీకి, విలన్ పాత్రలకు, పల్లెటూరి అమాయకత్వానికి మాత్రమే పరిమితం అయ్యేది. తెలంగాణలో మాట్లాడే తీరు, పదాలు, ఉచ్చారణను తెరపై ప్రత్యేకంగా చూపిస్తూ ఒక వర్గాన్ని కించపరిచిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇప్పుడు అదే తెలంగాణ యాస సినిమాలకు కొత్త ఊపిరిగా మారుతోంది.
హీరో తెరపైకి వచ్చి తెలంగాణ యాసలో మాట్లాడితే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. డైలాగ్‌లో ఉన్న సహజత్వం, పదాల్లో ఉండే మట్టి వాసన, మాట్లాడే విధానంలో కనిపించే తెలంగాణ నేటివిటీ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తున్నాయి. తెలంగాణ యాస అనేది కేవలం కొన్ని పదాల కలయిక కాదు. దాని వెనుక ఒక జీవనశైలి, ఒక సంస్కృతి, ఒక ప్రాంతపు మనస్తత్వం ఉంటుంది. అందుకే కథకు ఆ యాస సరిపడితే పాత్ర మరింత సహజంగా అనిపిస్తుంది.
నాని నటించిన ‘దసరా’ ఇందుకు మంచి ఉదాహరణ. సినిమాలోని పాత్రలు, వారి మాటతీరు, పాటలు తెలంగాణ ప్రాంతపు వాతావరణాన్ని తెరపై బలంగా తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘ధూమ్ ధామ్ దోస్తాన్’, ‘చమ్కీల అంగీలేసి’ లాంటి పాటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించాయి. ఇక్కడ యాసను కేవలం వినోదం కోసం కాకుండా కథలోని పాత్రల జీవితంలో భాగంగా చూపించడం ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
ఇక ‘డీజే టిల్లు’ విషయానికి వస్తే.. తెలంగాణ-హైదరాబాదీ మాటతీరు ఆ పాత్రకు ప్రత్యేకమైన ఐడెంటిటీగా మారింది. సిద్ధు జొన్నలగడ్డ కూడా తన పాత్ర హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో యువత మాట్లాడే తీరును ప్రతిబింబించేలా రూపొందించామని చెప్పిన సందర్భాలున్నాయి. టిల్లు మాట్లాడే విధానం, అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ కలిసిపోయి ఆ యాసను ఒక ట్రెండ్‌గా మార్చాయి.
‘మేం ఫేమస్’ వంటి సినిమాలు కూడా ప్రాంతీయ నేటివిటీని తెరపైకి తీసుకొచ్చాయి. ఇలాంటి సినిమాల వల్ల స్థానికంగా మాట్లాడే మాటలు, పల్లెటూరి పదాలు, అక్కడి జీవన విధానం ప్రేక్షకులకు కొత్తగా అనిపించకుండా.. తమ జీవితానికి దగ్గరగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ పదాలు పాటల్లోకి వస్తున్నాయి. డైలాగుల్లో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మీమ్స్ గా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమాలో హీరో ఇలా మాట్లాడతాడా? అని అనుకున్న మాటలే ఇప్పుడు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి.
ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’పై కూడా ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉండే మాటతీరు, స్థానిక ఫ్లేవర్ సినిమాకు ఎంతవరకు బలం చేకూరుస్తుందో చూడాలి. ఇక పాటల విషయానికి వస్తే.. తెలంగాణ పదాలతో, స్థానిక పలుకుబడితో రూపొందుతున్న పాటలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతున్నాయి. ‘ఆయా షేర్’, ‘దొరల్ దాగు ఇప్పసారాయ్’ పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఒక ప్రాంతపు భాషలో ఉన్న ప్రత్యేకమైన రిథమ్‌కి సంగీతం తోడైతే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా అందరికీ చేరుతోంది అని నిరూపిస్తున్నాయి.
నిజానికి తెలంగాణ యాసలో కొత్తగా వచ్చిన గొప్పదనం ఏమీ లేదు. అది ఎప్పటి నుంచో ప్రజల జీవితంలో ఉంది. మారింది మాత్రం దాన్ని చూసే విధానం. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతానికి గుర్తుగా చూసిన యాస.. ఇప్పుడు పాత్రకు స్టైల్ ఇస్తోంది. ఒకప్పుడు విలన్ నోట వినిపించిన మాట.. ఇప్పుడు హీరో నోట వినిపిస్తే థియేటర్‌లో చప్పట్లు పడుతున్నాయి. ఇది కేవలం సినిమాల్లో వచ్చిన మార్పు కాదు. ఒక ప్రాంతపు భాషకు, అక్కడి సంస్కృతికి దక్కుతున్న గౌరవానికి సంకేతం. ఒకప్పుడు చిన్నచూపు చూసిన తెలంగాణ యాస.. ఇప్పుడు తెలుగు సినిమా తెరపై తలెత్తుకుని నిలబడుతోంది. కళామతల్లి ఒడిలో ఒకప్పుడు పక్కకు నెట్టబడిన ఆ మాటలే.. ఇప్పుడు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నాయి.
Read Also: ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!