Polytechnic Colleges: పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో కాలేజీలు ఎలా నడుస్తున్నాయో.. ఇకపై కూడా అలాగే కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
కావాలనే అనుమానాలు వచ్చేలా
పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేట్ చేస్తామంటూ కొంతమంది విద్యార్థుల్లో కావాలనే అనుమానాలు వచ్చేలా చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.కాలేజీలకు సంబంధించిన భూములు అమ్మేస్తారని, ఉద్యోగాలు పోతాయని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మరోసారి తేల్చిచెప్పారు.
అయితే పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. దీన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి యంగ్ ఇండియా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం అంటే కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కాదని వివరించారు. విద్యార్థులకు మరింత మంచి సాంకేతిక విద్య అందించడానికే ఈ మార్పు చేస్తున్నామని చెప్పారు.
సిద్ధం చేయాల్సిన అవసరం
ఇప్పటి రోజుల్లో పరిశ్రమల్లో టెక్నాలజీ చాలా వేగంగా మారుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు తగ్గట్టుగా పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం పాత పద్ధతుల్లో చదువు చెప్పడం కాకుండా.. ప్రస్తుతం కంపెనీలకు ఏం కావాలి, ఎలాంటి నైపుణ్యాలు కావాలి అనే దానిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
AI, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి కొత్త రంగాల్లో భవిష్యత్తులో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు. అందుకే పాలిటెక్నిక్ కోర్సులను కూడా ఈ రంగాలకు తగ్గట్టుగా మార్చాలని భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ఇబ్బంది పడకుండా.. చదువుకునే సమయంలోనే అవసరమైన స్కిల్స్ నేర్చుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లు, మౌలిక వసతులను కూడా మరింత బలోపేతం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. లెక్చరర్స్ కూడా కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ డెవలప్‌మెంట్ విభాగాలను కలిపి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొంతమంది తప్పుడు ప్రచారం
ఇక ఐటీఐల విషయంలోనూ ఇలాగే కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని సీఎం గుర్తుచేశారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు నేర్పిస్తున్నామని చెప్పారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చినంత మాత్రాన వాటిని ప్రైవేటు పరం చేసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. అంతేకాదు.. ఏటీసీల కోసం ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల రెవెన్యూ భూమిని కేటాయించిందని చెప్పారు. ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం భూములు అమ్ముకోవాలనుకుంటే కొత్తగా భూములు కేటాయించి, కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు.
అనుమానాలు ఉంటే వాటిని క్లియర్
పాలిటెక్నిక్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా పెట్టుబడులు పెడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాలేజీలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల్లో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని క్లియర్ చేస్తామని తెలిపారు. అవసరమైతే జీవోలో కూడా మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్ కాలేజీలకు AICTE అనుమతులు లేవంటూ వస్తున్న విమర్శలపైనా సీఎం స్పందించారు. దీనిపై ఆందోళన అవసరం లేదని, అవసరమైన AICTE అనుమతులను స్కిల్స్ యూనివర్సిటీకి తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థుల చదువుకు, భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రూ.8 లక్షల కోట్ల అప్పు భారం
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పు భారం పెట్టిందని, దాంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా తమ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని అన్నారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,488 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించిందని వివరించారు.
గత ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రజలకు గుర్తు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి.. స్పీకర్ అనుమతితో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన పాత వీడియోను సభలో ప్రదర్శించడం విశేషం.
ALSO READ:పసుపు నీళ్లతో కడిగారా? క్షుద్ర పూజలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మొత్తానికి పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారుచదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరికేలా విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడమే ప్రభుత్వ అసలు లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.