Revanth Reddy Education Policy:తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. పిల్లల తలరాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని, ఈ దేశ భవిష్యత్తు మన పాఠశాలల తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన స్పష్టం చేశారు.
అందుకే తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో బాధ్యత కలిగిన పదవిలో ఉన్నప్పటికీ, విద్యారంగాన్ని పర్యవేక్షించడం అత్యంత ముఖ్యమని భావించి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని చెప్పుకొచ్చారు.
నిరుద్యోగులకు పెద్దపీట
ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తమ కట్టుబాటును చూపిస్తోందని, అందులో భాగంగానే మూడేళ్ల వ్యవధిలోనే విద్యా శాఖ బడ్జెట్‌ను ఏకంగా రూ.7,554 కోట్లకు భారీగా పెంచామని వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పెద్దపీట వేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటైన కేవలం 55 రోజులోనే రికార్డు స్థాయిలో 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించామని గుర్తుచేశారు.ఈ నియామక ప్రక్రియ మొత్తంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా , చిన్న ఆరోపణ కూడా రాకుండా పారదర్శకంగా పూర్తి చేయడం తమ ప్రభుత్వ నిజాయితీకి నిదర్శనమని సభలో తెలిపారు.
నిరుద్యోగుల కలలను నిజం
అదే సమయంలో గత ప్రభుత్వం పదేళ్ల సుదీర్ఘ పాలనలో కేవలం 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించిందని, తాము మాత్రం కొద్ది నెలల్లోనే అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కలలను నిజం చేశామని చెప్పారు.
మారుతున్న కాలం మరియు టెక్నాలజీకి అనుగుణంగా భావి తరాల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని సీఎం ప్రకటించారు. రాబోయే జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ బోధనా పద్ధతులు, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను మన ప్రభుత్వ పాఠశాలలకు పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు.
వివాదాలు రావడం సహజం
అయితే విద్యారంగంలో ఊహించని మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు వివాదాలు రావడం సహజమేనని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 97 విషయంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయని, కానీ విద్యార్థుల భవిష్యత్తు మరియు విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
తాను విద్యాశాఖ మంత్రిగా నేరుగా బాధ్యతలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోతున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. సర్కార్ బడులలో నాణ్యమైన విద్య అందుతోందనే నమ్మకం ప్రజల్లో పెరిగిందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఏకంగా 86 వేల మంది విద్యార్థులు చేరారని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఈ సంఖ్యనే విద్యాశాఖ మంత్రిగా తన పనితీరుకు ప్రత్యక్ష నిదర్శనమని సభలో ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, వసతులు పెంచడానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు.