
Revanth Reddy Boath | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా.. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి కుటుంబాలను కేసీఆర్ ఒక్కసారి కూడా పరామర్శించడానికి వెళ్ల లేదని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం ద్వారా నెల నెలా రూ.2,500 ఇస్తామని చెప్పారు.
“ఆదివాసీలు , లాంబాడాలు కాంగ్రెస్ పార్టీకు రెండు కళ్లలాంటివారు. తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేది. అలాంటిది మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు కలిసి ప్రస్తుతం ఆ ధరను రూ.1200 చేసేశారు. తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెబుతున్న కేసీఆర్.. పది సంవత్సరాల్లో బోథ్‌కు నీళ్లు ఎందుకు రాలేదో చెప్పాలి. ఈ ప్రాంతంలో పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, ఈ ప్రాంతంలోని గూడేలలో రోడ్లెందుకు వేయలేదు, వర్షాకలంలో గర్భవతులను ఇంకా కట్టెలపై ఎందుకు తీసుకెళుతున్నారు” అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గంలో ఒక్కసారి ఓటు వేయండి. కాంగ్రెస్ గెలిస్తే బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత నాది, ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా. డిసెంబర్ లోపు బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తా. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతాం” అని రేవంత్‌రెడ్డి అన్నారు.