
Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ(TDP) పోటీచేయడం లేదు. కానీ ఆ పార్టీ నాయకులు తమకు మద్దతు తెలపాలని బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తరువాత తెలంగాణ రాజకీయ నాయకులు చాలామంది ఆయన పట్ల సానుభూతి తెలిపారు. మరికొందరు నేతలైతే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇది కూడా తెలంగాణ ఎన్నికలలో టిడీపీ సానుభూతిపరుల ఓట్లు పొందడానికే.
తాజాగా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి మాలోత్ రాందాస్‌నాయక్‌కు మద్దతు ఇవ్వాలని టీడీపీ(TDP) నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. మంగళవారం వైరా మండలం వెంగన్నపాలెం గ్రామంలో మండల టీడీపీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలో గ్రామాల వారీగా నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.
కాంగ్రెస్ అభ్యర్థి వైపే టీడీపీ శ్రేణులంతా మొగ్గు చూపడంతో ఏకగ్రీవంగా రాందాస్ నాయక్‌కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టిడీపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌తో కలిసి పని చేసి రాందాస్‌నాయక్ విజయానికి కృషి చేయాలని తెలిపారు.