
Revanth Reddy Janagama | కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జనగామను రెవెన్యూ డివిజన్ చేస్తామని, ఈ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జనగామ అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ పాల్గొన్నారు. ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ప్రచారంలో మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజల త్యాగానికి ప్రత్యేక స్థానం ఉంది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపాన్న గౌడ్ లాంటి మహాత్ముల స్ఫూర్తి జనగామ ప్రజలలో కనిపిస్తుంది. నిజాం రజాకర్లతో పోరాడిన వీరులు పుట్టిన గడ్డ జనగామ. వేలాది మందిగా తరలి వచ్చిన మిమ్మల్ని చూస్తే జనగామ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని నమ్మకం కలుగుతోంది. పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. ఆయనను 47 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పదవులు ఇచ్చింది. అలాంటి పెద్దాయన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేశారు. పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కట్టుబానిసలా ఉండే ఎమ్మెల్యేలు ఉండాలని కేసీఆర్ కోరుకుంటారు. అందుకే జనగామలో పల్లాను నిలబెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే జనగామను రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ఈ పదేళ్లలో ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇచ్చారని ప్రశ్నించారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏ విధంగా భూకబ్జాలు చేశారో, పేదవాళ్లకు అన్యాయం చేశారో ఆయన కూతరే చెప్పిందని.. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సొంత సోదరి ఆస్తులను కాజేసిన పాపాత్ముడని బీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు. అలాంటి వారితో సీనియర్ నాయకుడైన అయిన పొన్నాల లక్ష్మయ్య చేతులు కలిపాడని ఎద్దేవా చేశారు. “కాంగ్రెస్ గెలిస్తే.. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. విద్యార్థులకు యువ వికాసం కింద రూ.5లక్షలు ఇస్తాం. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలతో ఆడ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతాం. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు వేస్తాం, ” అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
.
..