
Uttarakhand Tunnel Collapse : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న టన్నెల్(సొరంగం) కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ సొరంగంలో 40 మంది కార్మికులు అప్పటి నుంచి చిక్కుకుపోయి ఉన్నారు.
ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా ఆ శిథిలాల కింద 40 మంది కార్మికలని సహాయక సిబ్బంది బయటికి తీయలేక పోతోంది. వాళ్లను బయటకు తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికారుల తెలిపారు.
ఈ క్రమంలోనే కొందరు వర్కర్స్ ఘటనా స్థలం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ తోటి కార్మికులను బయటకు తీయాలంటూ నినాదాలు చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు హామీ ఇస్తున్నప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు ఆలస్యం అవుతోందంటూ అసహనంతో ప్రశ్నించారు.
ఈ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులకు సూచించారు. లోపల చిక్కుకున్న కార్మికుల కోసం ఆక్సిజన్ ఏర్పాట్లు చేశామని.. అలాగే డ్రిల్లింగ్ మెషీన్‌లతో శిథిలాలను కట్ చేసి 900 మిల్లీమీటర్ల వెడల్పు గల పైపుల సహాయంతో లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మంది ఝార్ఖండ్ వాసులూ ఉన్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఈ అంశంపై అన్ని విధాలుగా అండగా ఉంటామని కార్మికుల కుటుంబాలకు హామీ ఇచ్చారు.