Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ పార్టీల భవిష్యత్ మార్చబోతుందా? ఈ పోరు రణరంగాన్ని తలపిస్తోందా? పార్టీల నేతలు వ్యూహ-ప్రతివ్యూహాల్లో నిమగ్న మయ్యారా? పలు పార్టీలకు అంతర్గత కుమ్ములాటలు దెబ్బ తీస్తున్నాయా? ఇలాంటి నేపథ్యంలో ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది? ఐపీఎల్ మాదిరిగా ఉపఎన్నిక మారిందా? కొన్ని సంస్థల అంచనాలు, సర్వేల ఆధారంగా పందెం రాయుళ్లు రంగంలోకి దిగేశారా? కాయ్ రాజా కాయ్ అంటున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటివరకు ప్రచారం ఒకెత్తు.. ఇకపై మరో ఎత్తు. వివిధ పార్టీలు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు సర్వేలు చేయిస్తున్నాయి. ఓటర్ల నాడి ఎలా వుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మూడు పార్టీల నేతలు మూడు వైపులా చుట్టేస్తున్నారు.
ఉదయం ఆరు గంటల నుంచి మొదలైన ప్రచారం రాత్రి 10 గంటల వరకు సాగుతుందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఐపీఎల్ మాదిరిగా ఉత్కంఠ మొదలైంది. జూబ్లీ కోటలో జెండా ఎగురు వేయాలని అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్- బీజేపీలు తహతహలాడుతున్నాయి. ఫలితంగా ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్
గెలుపు తమదేనని మూడు పార్టీల నేతలు ధీమా చెబుతున్నారు. ఇంతకీ గ్రౌండ్‌లో ఏం జరుగుతోంది? దిగువ-మధ్య-ఎగువ స్థాయి ప్రజలు ఏమంటున్నారు? గడిచిన మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఛాన్స్ ఇచ్చామని అంటున్నారు ఓటర్లు. ఆ పార్టీ రెండుసార్లు అధికారంలోకి ఉందని, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నచందంగా ఉందని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీని గెలుపిస్తే నియోజకవర్గానికి సంబంధించిన పనులు జరుగుతాయని అంటున్నారు.
తాగునీరు, వరదలు, రోడ్లు, డ్రైనేజీ పద్దతి బాగుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొ స్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలు చేపట్టిన సర్వేలు, వివిధ సంస్థల నివేదికలతో పందెం రాయుళ్లు రంగంలోకి దిగేశారు. కూకట్‌పల్లి కేంద్రంగా ఉప ఎన్నికపై బెట్టింగులు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొందరు, బీఆర్ఎస్ గెలుస్తుందని మరికొందరు బెట్టింగులు మొదలుపెట్టారు. గెలుపు-ఓటములతోపాటు మెజార్టీ, సెకండ్ ప్లేస్ వంటి వాటిపై జోరుగా సాగుతున్నాయి.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీకి మద్దతుగా తెరపైకి జనసేన
బెట్టింగుల కోసం ముందుగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు పందెం రాయుళ్లు. పొలాలు, ఆస్తులు, ప్లాట్లు కూడా రాయించుకుంటున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. మరికొందరు ప్రత్యేక యాప్ ద్వారా బెట్టింగుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే గెలుపు పోటములపై భారీగా బెట్టింగులు కొనసాగుతున్నాయి.
మినిమమ్ 10 వేల మెజార్టీ కంటే ఎక్కువ లేదా తక్కువ అనేదానిపై పందెం రాయుళ్లు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సెకండ్ ప్లేస్‌లో బీజేపీ వస్తుందని కొందరు, ఆ పార్టీకి డిపాజిట్లు రావని మరికొందరు ఇలా బెట్టింగులు కాస్తున్నారు. రానున్న ఐదు రోజుల్లో బెట్టింగులు కాసేవారి సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. అలాగే ఈ ఐదురోజులు పీపుల్ మూడ్ మారవచ్చని అంటున్నారు నేతలు.