Stri Nidhi: స్వేచ్చ బ్యూరో: స్త్రీ నిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగాల భర్తీలో మాత్రం రోస్టర్ కు సంబంధించిన అంశమే లేదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు అసలు ఆర్థికశాఖ అనుమతిలేకుండా ఎలా భర్తీ చేస్తారు.. స్త్రీనిధి ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకొని చేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. లేకుంటే కేవలం అయినవారికే పదవులు అట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే నోటిఫికేషన్ వేశారా?..అసలు ఉద్యోగాల భర్తీలో మతలబేంటి అనేది ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. 2019 నుంచి నాన్చుతూ సడన్ గా భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం.. అసలు శాఖలో ఏంజరుగుతోందనే ప్రచారం జరుగుతుంది. ఎండీ విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి పదవికాలం అయిపోతుండటంతోనే త్వరగా భర్తీచేయాలనే నోటిఫికేషన్ వేశారా? అనే ముమ్మర ప్రచారం జరుగుతుంది.
స్త్రీ నిధిలో ఉద్యోగాల భర్తీకి గత నెల 29న నోటిఫికేషన్ విడుదలైంది. 20పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ అప్లికేషన్లకు చివరి తేదీ అని పేర్కొన్నారు. ఇంత వరకు భాగానే ఉంది. కానీ ఇందులో మాత్రం ఏదో మతలబు దాగిఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్ ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉంది. ఎవరికి( ఏ క్యాస్ట్ కు)ఎన్ని ఉద్యోగాలు కేటాయిస్తున్నామనేది నోటీఫికేషన్ లో సైతం స్పష్టంగా ఉండాలి. దానిని బట్టి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.కానీ ఆ నిబంధన స్త్రీనిధికి వర్తించదేమో మరి. ఎందుకు రోస్టర్ పాయింట్ పెట్టలేదు. అయినవారికే పోస్టింగ్ ఇప్పించుకోవాలనే తపన తోనే నోటిఫికేషన్ ఇచ్చారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శాఖలో ఉద్యోగాల భర్తీ చేయాలంటే జీఓ ఎంస్ నెంబర్ 275 ప్రకారం ఫైనాన్స్, ప్లానింగ్ డిపార్టుమెంట్ 1995 ప్రకారం అన్ని డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థికశాఖ నుంచి అనుమతి పొందాలి. 2008జీఓఆర్టీ నెంబర్ 4271 ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రకారం అన్ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతన ప్రాతిపదికన అభ్యర్థుల నియామకం కోసం ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఆర్థికశాఖ మంత్రి,హోంమంత్రి, ఫైనాన్స్ మంత్రితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ద్వారా సీఎం నుంచి సర్క్యూలేషన్‌లో ఉన్న ఆర్డర్ ను పొందాలని ఆర్థికశాఖ స్పష్టం చేస్తుంది. ఇది ఇలా ఉంటే సొసైటీ ఏర్పడిన 45 రోజుల్లో సహకార చట్టం 1964 సెక్షన్ 116సీ రూల్ నెంబర్ 28 ప్రకారం..పేర్కొన్న నిబంధనలు తెలంగాణ స్టేట్ కోఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ కు కూడా వర్తిస్తాయి. దీని ప్రకారం కేడర్ ఫిక్సెషన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేదని సమాచారం. అంతేకాదు ఉద్యోగులకు పేస్కేల్ సైతం ఇవ్వలేదు. దీనికి ప్రకారం ఆఫీస్ కేడర్ వ్యక్తి 58 ఏళ్లకే రిటైర్డ్ కావల్సి ఉన్నప్పటికీ 55 నుంచి 63 ఏళ్లకు ప్రస్తుతం పనిచేస్తున్న స్త్రీ నిధి ఎండీ సొంత నిర్ణయంతో పెంచుకున్నారనే ప్రచారం జరుగుతుంది.
Also Read: తమిళనాడులో నిశ్శబ్ద విప్లవం.. ఎన్టీఆర్ చరిత్రను విజయ్ తిరగరాయనున్నారా?
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎండీగా పనిచేస్తున్న విద్యాసాగర్ రెడ్డి పదవి కాలం ఈ నెల 23తో ముగుస్తుంది. అందుకే హడావిడిగా ఉద్యోగ నోటిఫికేషన్ వేశారనే ప్రచారం జరుగుతుంది. సొంతవారిని నియమించుకోవడానికే ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూలతోనే భర్తీ చేస్తున్నారని సమాచారం. అంటే ఆర్థికశాఖ అనుమతిలేదు.. రోస్టర్ పాయింట్ లేదు.. అంటే స్త్రీ నిధి అనేది ప్రభుత్వ శాఖ కాదా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇచ్చిన నోటిఫికేషన్ లో సీనియర్ ఐటీ కన్సల్టెంట్ కు రూ.2,25,000వేలు వేతనం, టీం లీడర్ రిసెర్చ్ అండ్ కన్సల్టెంట్ కు సైతం 2,25,000వేలు వేతనంగా పేర్కొనడం గమనార్హం.
అదే విధంగా జనరల్ మేనేజర్ కు 2లక్షలు వేతనం, డిప్యూటీ జనరల్ మేనేజర్ (మానిటరింగ్) కు రూ.1,50,000 వేతనం, అసోసియేట్ రిసోర్చ్ కన్సల్టెన్సీకి రూ.1,50,000 వేతనం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ కి రూ.1,25,000లు ఇలా అత్యధిక వేతనాలు ఫిక్స్ చేయడం, వీటితో పాటు అలవెన్స్ లు సైతం ఉండనున్నాయి. అంటే భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం దేనికి నిదర్శనం అనే చర్చ భారీగా జరుగుతుంది. అనుయాయులకు కట్టబెట్టడానికే ఈ భారీ స్థాయిలో వేతనాలు ఫిక్స్ చేశారా? అనేది హాట్ టాపిక్ అయింది. మహిళల ఒక్కో రూపాయి కష్టపడి కూడబెట్టుకుంటున్న సొమ్మును ఉద్యోగాల పేరుతో ఒక్కోక్కరికి లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడటం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. ఇచ్చేవారి సొమ్ము కాదనే ఇష్టానుసారంగా వేతనాలు ఫిక్స్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి తోడు ఎఫ్ టీ ఈ(ఫిక్స్ టెన్యూర్ ఎంప్లాయిస్) కింద 5 ఏళ్లు కాంట్రాక్టు అనితీసుకొని ప్రతి ఏటా అగ్రిమెంట్ చేసుకొంటున్నారనే ప్రచారం జరుగుతుంది. కన్సల్టెంట్ గా జాయిన్అయిన 9 మందిని గతేడాది ఏప్రిల్ లో రెగ్యూలర్ చేయడం దేనికి సంకేతం అనే చర్చజరుగుతుంది. 50మందిని ఒకేసారి ఉద్యోగాల్లోకి తీసుకుంటే కేవలం 9 మందికే ఎందుకు రెగ్యూలర్ చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా స్త్రీ నిధిలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై మంత్రి, ప్రభుత్వం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. మరి ఆదిశగా చర్యలు చేపడతారా? లేదా? అనేది చూడాలి.
Also Read: ఫలితాల వేళ మమతా బెనర్జీ సంచలన వీడియో.. తుది ఫలితాలు మారుతాయంటున్న దీదీ