Voter Revision: స్వేచ్చ బ్యూరో: ఓటరు జాబితాలోని తప్పులను సరి చేసి, బోగస్ ఓట్లను ఏరివేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గత నెల 25వ తేదీన మొదలైన సర్ ప్రక్రియకు సంబంధించి ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 4062 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సుమారు 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లకు సర్ ప్రక్రియకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఫారం-6,7,8 లను కూడా ఇంటింటికి పంపిణీ చేసి, ఓటరు పూరించిన తర్వాత మళ్లీ ఇంటింటికెళ్లి స్వీకరించాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు సక్రమంగా విధులకు హాజరుకావటం లేదన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రక్రియ పారదర్శకంగా, బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు అసిస్టెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా నిబద్ధతతో విధులు నిర్వహించేలా విజిలెన్స్ అధికారులు ఫీల్డు లెవెల్ లో సర్ ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను హైదరాబాద్ జిల్లాలో గమనిస్తే, జిల్లా చాలా వెనుకబడి ఉండటం, వచ్చే నెల 3వ తేదీతో సర్ ప్రక్రియ గడువు ముగియనున్నందున జిల్లా ఎన్నికల అధికారులు సిటీలో సర్ కోసం విజిలెన్స్ తో ఫోకస్ చేయిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ విజిలెన్స్ హెడ్ గా వ్యవహరిస్తున్న అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి సైతం పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు.
Also read: కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!
హైదరాబాద్ నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్దెకు ఉంటూ, సిటీలో ఓటు హక్కు కల్గిన వారు సర్ ప్రక్రియ పూరి చేసుకోవాలంటే కొంత అదనంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఓటు వేసి, ఇళ్లు మారిన ఓటర్లు గత ఎన్నికల్లో ఓటు వేసిన చిరునామా ఏ పోలింగ్ స్టేషన్ కు వస్తుందన్న విషయాన్ని తెల్సుకుని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ ను కలిసి, ఫారాలు తీసుకుని, పూరించి, సర్ 2002 వివరాలతో పాటు ఫొటో ఓటరు డిక్లరేషన్ తో తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్లకే సమర్పించాల్సి ఉంటుందని ఎలక్షన్ వింగ్ అధికారులు వెల్లడించారు.
సిటీలోని పలు నియోజకవర్గాలను ఆకస్మికంగా ఎంపిక చేసుకుని, పోలింగ్ బూత్ ల వారీగా జరుగుతున్న సర్ ప్రక్రియకు సంబంధించి, బూత్ లెవెల్ ఆఫీసర్ల పనితీరు, అంగన్ వాడీ, ఆశా వర్కర్ల పని తీరు వంటి అంశాలతో పాటు రాజకీయ పార్టీలు చేస్తున్న సర్ ప్రక్రియ, సర్ ప్రక్రియకు క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్ కు, ఓటరుకు సహకరించేందుకు వీలుగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ల నుంచి నియమితులైన 10 వేల 901 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్ర స్థాయిలో ఎంతమంది సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారన్న విషయాలపై విజిలెన్స్ అధికారులు రోజువారీ నివేదికలను కమిషనర్ కు సమర్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివిధ పార్టీలకు చెందిన ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తమకు ఫేవర్ గా లేని ఓట్లను తొలగిస్తున్నారా? లేక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారా? అన్న కోణంలో కూడా విజిలెన్స్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!