Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ సైక్లోన్ ప్రభావం కారణంగా వేల కోట్ల నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొంథా తుఫాన్ రైతులకు కన్నీటిని మిగిల్చింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. వరంగల్, హన్మకొండ నగరాలు వరదలతో మునిగిపోయాయి.
⦿ వరంగల్ లో ఇది పరిస్థితి..
వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఓరుగల్లు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తుఫాన్ ఎఫెక్ట్ ఇంకో 24 గంటలు కొనసాగితే మాత్రం.. వరంగల్ సిటీ మునిగిపోయేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరంగల్ నగరంలో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా రైతులకు మాత్రం బోలెడంత నష్టం తెచ్చిపెట్టింది. అయితే.. అప్పులు చేసి పంట పండించి.. కరెక్ట్ పంట చేతికి వచ్చే సమయానికే తుఫాన్ బీభత్సం సృష్టించండంతో లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు పొలాల వద్దకు వెళ్లి ఏడుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Penna River: పెన్నా నదిలో చిక్కుకున్న ఇసుక పడవలు వెలికితీత.. తప్పిన పెను ప్రమాదం
⦿ ఈ జిల్లాల్లో భారీ వర్షం..
అయితే.. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది.. కొన్ని చోట్ల పొడి వాతావరణ ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
⦿ భారీ వర్షాలతో జాగ్రత్త..!
తెలంగాణలో మిగిలిన జిల్లాల్లో పెద్దగా వర్షాల ప్రభావం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అన్నారు. ఏదేశమైనప్పటికీ భారీ వర్షాల పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు.