Chamala Kiran Kumar Reddy: తెలంగాణ కేబినెట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక మైనార్టీ నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంటే ఓర్వలేక, మైనార్టీలపై విద్వేషంతో ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో దేశాన్ని సమైక్యంగా ఉంచిందని, కానీ బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఎంపీ చామల అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సాకుగా చూపి, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుకట్ట వేయడానికి బీజేపీ నేతలు నేరుగా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే వారి కుట్రకు నిదర్శనమని అన్నారు. కేవలం ఫిర్యాదుతో ఆగకుండా, గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్నే ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
READ ALSO: Azharuddin Oath: రేపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, ఎందుకంటే?
ఈ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఎంపీ మండిపడ్డారు. గతంలో రాజస్థాన్‌లో శ్రీకరణ్‌పూర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సురేందర్‌పాల్ సింగ్‌కు ఎన్నికలకు 20 రోజుల ముందే మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. “వాళ్లు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా?” అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని, గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో చేసుకున్న అంతర్గత ఒప్పందం వల్లే బీజేపీ 8 సీట్లు గెలిచిందని చామల ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హైదరాబాద్ పేరును ప్రపంచ పటంలో నిలిపిన అజారుద్దీన్ లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ కుట్రలను మైనార్టీ సోదరులు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు గమనించి, ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.