 
					Fee Reimbursement Scheme: తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల వివాదం మళ్లీ ముదిరింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కాకపోగా, తమ కళాశాలలపై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తుండడాన్ని నిరసిస్తూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. ఈ అంశంపై చర్చించేందుకు యాజమాన్య ప్రతినిధులు బోట్స్ క్లబ్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా, విజిలెన్స్ దాడుల పేరుతో ప్రభుత్వం తమను బెదిరింపులకు గురిచేస్తోందని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. దీపావళి నాటికి రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు కేవలం రూ. 360 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వారు మండిపడ్డారు.
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు రూ. 10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, నవంబరర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలను మూసివేయాలని (బంద్) ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
నిధుల దుర్వినియోగంపై విచారణకు సర్కార్ ఆదేశం:
తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఫీజు కింద విడుదలవుతున్న ప్రభుత్వ నిధులను కొన్ని విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడి దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో, B.Ed, D.Ed కళాశాలలతో సహా స్కాలర్‌షిప్ పొందుతున్న అన్ని సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు బుధవారం(ఆక్టోబర్ 29న) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ భారీ విచారణకు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ బృందాలకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమీషనరేట్లు, అలాగే CID, ACB, ఇంటెలిజెన్స్ విభాగాల నుండి పూర్తి సహకారం అందించాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నత విద్యా, పాఠశాల విద్యా శాఖల అధికారులను కూడా ఈ తనిఖీ బృందాల్లో భాగం చేయనున్నారు.
Read Also: Jio-Google Gemini Pro: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త… 18 నెలల పాటు ఉచితమే!