Azharuddin: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ అజహరుద్దీన్‌కు తెలంగాణ క్యాబినెట్లో మంత్రి పదవి ఖరారైంది. అతి త్వరలో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది. అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఆయనకు క్యాబినెట్ బెర్త్ కట్టబెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి..
మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది. అయితే, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మాజీ క్రికెటర్, ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎంపికైన అజాహరుద్దీన్‌కు మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు.
ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. అజాహరుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాకపోయినప్పటికీ అజాహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణపై గత రెండ్రోజులుగా ఏఐసీసీలో విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
మొదటి సారి ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో కాంగ్రెష్ అధిష్ఠానం ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించింది. ఒక వేళ గవర్నర్ కోటాలో అజాహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో.. త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజాహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు ఏయే సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తామనడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముస్లింలను మభ్యపెట్టేందుకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ పేర్కొంటోంది.. ఈ మేరకు బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇందుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికనే ప్రధాన కారణంగా చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తుంది. కానీ, ఈ రెండేళ్లలో మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ పేర్కొంటోంది.. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది.
ఆ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ధ్వజమెత్తారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్ విద్వేషం పెంచుకున్నాయన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని.. మంత్రి పదవి దక్కకుండా కుట్రలు చేస్తున్నారన్నారు చామల. మైనార్టీలంటే బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఎందుకంత కడుపుమంటని… తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీ మంత్రి ఉండొద్దా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం మతాల మధ్య చిచ్చు పెడతారా అంటూ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. మరి అజార్ ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ ఆమోదం తెలుపుతారో? లేదో?… బీజేపీ ఫిర్యాదులపై ఈసీ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అనేది ఉత్కంఠ రేపుతోంది.
Story by Apparao, Big Tv