Addanki On Bjp: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శుత్రువులు ఉండరు. ట్రెండ్‌కు తగ్గట్టుగా అడుగులేస్తూ పోతుంటారు. లేకుండా పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డు పడుతుంది. ప్రస్తుతం బీజేపీ చేస్తుంది అదేనని అంటున్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి?
నిప్పు లేనిదే పొగ రాదనే సామెత ఉంది. ఇది ప్రస్తుత రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. పార్టీల వ్యూహ-ప్రతివ్యూహాల గురించి నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అఫ్ కోర్సు కారణాలు ఏమైనా కావచ్చు. ఇదే క్రమంలో బీజేపీ గురించి కీలక విషయాలు బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.
2029 ఎన్నికల్లో దేశమంతా పూర్తిస్థాయిలో అధికారంలోకి రావడానికి అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదిలో రాజకీయ కుట్రలకు బీజేపీ తెరలేపిందన్నారు అద్దంకి దయాకర్. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు మొదలు పెట్టిందన్నారు. సింపుల్‌గా ఆయన మాటల్లో చెప్పాలంటే రాజకీయ ప్రేరేపిత కుట్రలన్నమాట.
బీజేపీది సామ్రాజ్యవాద రాజకీయ దృక్పథమన్నారు. ఇటీవల కాలంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆ పార్టీకి ఆనవాయితీగా మారిందన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఎదగడం అనేది చాలా ప్రమాదకరమని గుర్తు చేశారు.
ALSO READ: బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు? ముగ్గురికి చేరిన సంఖ్య.. తెర వెనుక
దేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమ చూపిస్తుందన్నారు అద్దంకి. దేశ రాజ్యాంగ పరిరక్షణ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా చెప్పారు. పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతోందన్నారు. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను బయటపెట్టారు.
బీజేపీ వ్యవహరశైలితో చంద్రబాబు, నితీష్ కుమార్‌లకు ప్రమాదం పొంచి ఉందని సూచనప్రాయంగా చెప్పారు తెలంగాణ పీసీసీ కార్యదర్శి. ఏపీ కూటమి ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయని చెప్పకనే చెప్పారు. సీఎం చంద్రబాబుతో కయ్యం.. మనగడకు కష్టమని బీజేపీకి తెలుసన్నారు.
అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. మిత్రులతో రాజకీయ లబ్ధి పొంది, ఆ పార్టీని అంతమొందించాలన్నదే కమలం ఎత్తుగడగా వర్ణించారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలను గుర్తు చేశారాయన.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ కేవలం రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని, ఆ విషయం ఆ నేతలకూ తెలుసన్నారు. మొత్తానికి అద్దంకి మాటల్లో బీజేపీ ఏదో ప్రయోగం చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన ఇంకెన్ని విషయాలు బయటపెడతారో వెయిట్ అండ్ సీ.