Jubilee Hills bypoll: ఏడ చూసినా ఇప్పుడు ఒక్కటే ముచ్చట.. జూబ్లీహిల్స్ రణరంగం.. జూబ్లీలో గెలిచేది ఎవరు..? ఆ రెండు పార్టీల్లో ఏది గెలుస్తోంది..? కింగ్ అయ్యేంది.. బీఆర్ఎస్ పార్టీనా.. కాంగ్రెస్ పార్టీనా..? అనే ముచ్చటే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అయితే.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అధికార పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇప్పటికే అనేక సర్వేల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. దీనికి తోడు ప్రచారంలో సీఎం అనుసరిస్తున్న తీరు, అమలు చేస్తున్న వ్యూహాలు కాంగ్రెస్ విజయావకాశాలను మరింత మెరుగుపరుస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం.. ఇప్పటికే మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గెలుపు సునాయాసమే అయినా ఎక్కడా ఏమరపాటుగా ఉండవద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఆయన అనుసరిస్తున్న పంథా విపక్ష బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతోంది. కేవలం సెంటిమెంట్ ఆధారంగా ఎన్నికలు గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పాత విషయాలు గుర్తు చేసి కార్నర్ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్‌ను ప్రజలకు సీఎం వివరిస్తున్నారు.
⦿ తెరపైకి పీజేఆర్ ఉదంతం
జూబ్లీహిల్స్ బస్తీల్లో ప్రజలు తమ ఆరాధ్య దైవంగా భావించే పి. జనార్దన్ రెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ తన అభ్యర్థిని పోటీ చేయించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తు చేశారు. పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో అప్పటి ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయన్నారు. అయితే, పీజేఆర్ మరణంతో ఆయన కుటుంబంపై ప్రజల్లో వెల్లువెత్తిన సానుభూతిని కనీసం లెక్కచేయకుండా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ చేయించారనే అంశాన్ని లేవనెత్తారు. తద్వారా ఇప్పటికే కాంగ్రెస్ అభివృద్ధి అజెండా ముందు బీఆర్ఎస్ సెంటిమెంట్ నిలవలేకపోతోంది. ఈ తరుణంలో పీజేఆర్ అంశం తెరమీదకు రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఏ మొహం పెట్టుకొని సానుభూతి ఆధారంగా ఓట్లు అడుగుతుందని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
⦿ కంటోన్మెంట్ అభివృద్ధే ప్రూఫ్
ఇక జూబ్లీహిల్స్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను కంటోన్మెంట్‌తో ముడిపెట్టి ప్రజలకు రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో ఆ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించడం వల్ల అక్కడ రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. మెరుగైన నీటి వసతి, ఎలివేటెడ్ కారిడార్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇదే వరుసలో జూబ్లీహిల్స్ బస్తీల రూపురేఖలు మారుస్తామని ప్రజలను కన్విన్స్ చేయగలిగారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న రూ.200 కోట్ల అభివృద్ధి పనులు కేవలం ట్రైలర్ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
⦿ బీజేపీ-బీఆర్ఎస్‌ల దోస్తీపై
ఇక బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు నడుస్తోందని, వీరిది ఫెవికాల్ బంధమని ప్రజలకు వివరించారు. బీజేపీకి అవసరమైనప్పుడు బీఆర్ఎస్, బీఆర్ఎస్‌కు అవసరమైనప్పుడు బీజేపీలు కలిసి పనిచేస్తాని ప్రజలకు వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అవయవదానం చేసి బీజేపీని బతికించిందని, అందుకే ఆ పార్టీ 8 లోక్‌సభ స్థానాల్లో గెలిచిందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా జూబ్లీహిల్స్‌లో మెజారిటీ ఉన్న ముస్లిం మైనారిటీలను అప్రమత్తం చేయగలిగారు.
⦿ డ్రగ్స్ భూతాన్ని ఈగల్ ద్వారా…?
ఇక గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్‌ను పట్టిపీడించిన డ్రగ్స్ భూతాన్ని ఈగల్ ద్వారా అరికట్టగలిగామని వివరంచారు. డ్రగ్స్ దందాలను ఉపేక్షించేది లేదని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ సెంటిమెంట్ పాలిటిక్స్‌ను కార్నర్ చేస్తూ, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ కమిట్‌మెంట్‌ను వివరిస్తూ, బీఆర్ఎస్-బీజేపీల నుంచి మైనారిటీలను అప్రమత్తం చేస్తూ ముందుగుసాగుతోంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.
ALSO READ: SLBC Tunnel: SLBC ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే.. పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి