ఢిల్లీ లెవల్లో ఉప్పునిప్పులా పూర్తిగా భిన్న సిద్ధాంతాలతో కొట్టుకునే బీజేపీ, కాంగ్రెస్.. గల్లీకొచ్చేసరికి భాయిభాయీ అంటున్నాయి. కరీంగనర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలే ఇప్పుడు అందుకు వేదిక అయ్యింది. 12 మంది డైరెక్టర్ల కోసం అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ మళ్లీ మూడు ముక్కలుగా చీలిపోయి.. ప్రత్యర్థి పార్టీ బలపడే అవకాశాన్నిచ్చింది. అధికారంలో ఉండీ కూడ కాంగ్రెస్ అసమర్థతను ఎలా చాటుతుందో చెప్పే ఒక ఉదాహరణగా ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిలుస్తోంది. కరీంగనర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ పోటీ పడ్డాయి. ఒకటి కర్ర రాజశేఖర్ ప్యానెల్ కాగా.. మరొకటి అర్బన్ బ్యాంక్ తాజా మాజీ చైర్మన్‌గా పనిచేసిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ తో పాటు.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్.. ఈ మూడు ప్యానెల్స్ ఢీ అంటే ఢీ అన్నాయి.
వెలిచాల వర్గం పెద్దఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే, నిన్న జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఫలితాలు ప్రచారానికి భిన్నంగా కనిపించాయి. కర్ర రాజశేఖర్ ప్యానెల్ లో 9 మంది డైరెక్టర్స్ గా గెల్చారు. అందులో ఏడుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కాగా.. ఇద్దరు బీజేపీ నాయకులు. ఇక మరో ముగ్గురు డైరెక్టర్లలో ఒకరు ప్రో బీజేపీ నాయకుడైన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవగా… మరో ఇద్దరు వెలిచాల రాజేందర్ రావు వర్గీయులు డైరెక్టర్లుగా గెలిచారు. తనకంటే ముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన కర్ర రాజశేఖర్ ప్యానెల్ పై అవినీతి ఆరోపణలు చేసి కోర్టు మెట్లెక్కిన గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ అసలు ఒక్క డైరెక్టర్ స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే కర్ర రాజశేఖర్ ప్యానెల్ మొత్తం 9 మందిలో ఏడుగురు కాంగ్రెస్ నేతలు కాగా, ఇద్దరు బీజేపీ నేతలున్నారు. అయితే, కర్ర రాజశేఖర్ ప్యానెల్ గెలుపు తర్వాత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రావల్సిన అభినందనలు.. బీజేపీ నేతల నుంచి రావడమే ఇప్పుడు ఈ మొత్తం చర్చకు కారణం అయ్యింది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెల్చిన కర్ర రాజశేఖర్ వర్గానికి అభినందనలంటూ ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ చర్చకు మరింత ప్రధాన్యత సంతరించుకుంది.
కర్ర రాజశేఖర్ అండ్ టీంలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులు డైరెక్టర్లుగా గెలిస్తే.. దాన్ని బీజేపీ కేంద్ర మంత్రి ఓన్ చేసుకున్నారు. అంతేకాదు బండిసంజయ్ , ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు అన్నివిధాలా పూర్తి సయహా సహకారమందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్ర రాజశేఖర్ మరోసారి చైర్మన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉండగా.. ఆ కాంగ్రెస్ నాయకులందరినీ ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నిక తర్వాత బీజేపీలోకి ఆహ్వానించి, కాషాయ కండువాలు కప్పి అఫిషీయల్ బీజేపి నేతలుగా మార్చే తంతు ఇక తర్వాత ఉండనుంది. ఈ క్రమంలో.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కొట్టుకుంటూ.. మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ తనకు తానే భస్మాసుర హస్తాన్ని తయారుచేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. అందుకు ఈ అర్బన్ బ్యాంక్ ఫలితాలనే ఓ ఉదాహరణగా జిల్లాలో చర్చించుకుంటున్నారు.
బలమైన ప్రత్యర్థి పోరాటం చేయడం సిసలైన పోటీ. కానీ, తమలో తామే కొట్లాడుకుని.. ప్రత్యర్థికి పోటీ లేకుండా చేయడం అసమర్థత, చేతగానితనం, ఐకమత్య లోపం. ఇవన్నీ హస్తం పార్టీ జిల్లాలో పెంచి పోషిస్తూ… తమ పార్టీ నుంచి గెల్చిన డైరెక్టర్లను కూడా ఓన్ చేసుకోలేక.. ఆ పోటీలోనూ మూడుముక్కలాటకు తెరతీసి.. ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి ఆ క్రెడిట్‌ను హస్తగతం చేయడం చేతగానితనంగా ఇప్పుడు పెద్ద చర్చకు తెరలేచింది