CM Revanth Reddy: హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరుగుతున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. ఇందులో ఈ రెండేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు. అలాగే గతాన్ని కూడా గుర్తు చేసుకుందాం అన్నారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని రూపుమాపాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. అలాగే కేటీఆర్ ఎన్నికల ప్రచార సరళిని చూస్తే.. పుష్ప-2 సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌లా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నాయకత్వం వహించాలనుకునే కేటీఆర్.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేసి కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారని ఆరోపించారు. దీనిని గమనించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
అలాగే కేటీఆర్‌పై సీఎం రేవంత్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేతిలో సీఎం అయ్యే రేఖ లేదు. దశలేని వారికి దిశ మారిస్తే ఏం వస్తుంది. సొంత చెల్లికి, మాగంటి గోపీనాథ్ తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి కేటీఆర్. అలాగే తెలంగాణ ఉద్యమ ఆత్మను కేసీఆర్ చంపేశారు. జూబ్లిహిల్స్ లో మురికికి అప్పటి మంత్రి కేటీఆరే కారణం అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి, ఆ మాటను నెరవేర్చేందుకు రాజకీయ నష్టాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చినది సోనియా గాంధీ. ఆమె త్యాగమే ఈ రాష్ట్రానికి పునాది అని అన్నారు సీఎం రేవంత్. యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల్లో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని గుర్తు చేశారు.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి, రూ.1300 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం మొదటి సంతకం చేసారని పేర్కొన్నారు. అదే విధంగా, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కాలంలో రూ.73 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశారని చెప్పారు. కనీస మద్దతు ధరల పెంపుతో రైతులకు ఊరటనిచ్చిందని గుర్తుచేశారు.
జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని రేవంత్ తెలిపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్, ఇందిరా సాగర్, ఎస్ఎల్బీసీ, ప్రాణహిత-చేవెళ్ల వంటి భారీ ప్రాజెక్టులు కాంగ్రెస్ కాలంలో ప్రారంభమయ్యాయని చెప్పారు. పేదల గుండె చప్పుడు వినే పీజేఆర్, దున్నే వాడికే భూమి అనే నినాదం ఇచ్చిన ఇందిరమ్మ, పీవీ నరసింహారావు వంటి నాయకుల వల్లే సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది అని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు, కాంగ్రెస్ నాయకులు కుండలతో నిరసన తెలిపి, కృష్ణా జలాలను నగరానికి తేవడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. మెట్రో రైలు, ఐటీ, ఫార్మా రంగాలు, నాలెడ్జ్ సిటీగా హైదరాబాదు అభివృద్ధి ఇవన్నీ కాంగ్రెస్ విధానాల ఫలితం అని రేవంత్ పేర్కొన్నారు.
అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ. 60 వేల కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాం, కానీ బీఆర్‌ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు కట్టేసారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకుంటూ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని ఆరోపించారు.
తన ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందని, ఆర్టీసీని లాభాల దిశగా తీసుకెళ్లాం, ఉచిత బస్సు ప్రయాణానికి రూ.7100 కోట్లు ఖర్చు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు నిర్మాణాలు కొనసాగుతున్నాయి అని వివరించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము పాత పథకాలను ఆపలేదు. రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ అన్నీ కొనసాగుతున్నాయి. రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు ఖర్చు చేశాం, రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు విడుదల చేశాం అని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శిస్తూ.. వారు నిర్మించిన ప్రగతి భవన్, సచివాలయం వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? విద్యార్థులకు కొత్త యూనివర్సిటీ ఏదైనా తీసుకువచ్చారా? 5 వేల పాఠశాలలు మూసేశారు, పేదల విద్యను దూరం చేశారు అని అన్నారు.
కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాం లా మారిపోయారు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు. కేటీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో ఉంటూ ప్రజల బాధలను మరిచిపోయాడు అని మండిపడ్డారు.
Also Read: జూబ్లిహిల్స్ పేరు మారుస్తాం: బండి సంజయ్
రాష్ట్ర ప్రజల అభివృద్ధి తమ ప్రభుత్వం ధ్యేయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి పదేళ్లలో ఒక్క చుక్క అదనంగా నీరు తెచ్చుకోలేకపోయారు, కానీ మేము గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మేం వచ్చాకే 70 శాతం కొత్త జీసీసీలు ఏర్పడ్డాయి. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రజల అభివృద్ధే మా లక్ష్యం. జూబ్లీహిల్స్ గెలవాలి, తెలంగాణ అభివృద్ధి కొనసాగాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.