Ramagundam Temple Demolition: రామగుండంలో దారి మైసమ్మ ఆలయాల మూకుమ్మడి కూల్చివేతపై రాజకీయ రగడ నెలకొంది. కావాలనే కాంగ్రెస్.. కూల్చివేయించిందని బీజేపీ, బిఅర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హిందూ సంఘాలు రోడ్డేక్కాయి. రోడ్డు వెడల్పులో భాగంగా.. కూల్చి వేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ కూల్చి వేత వ్యవహారం పై గోదావరిఖనిలో పెను దుమారాన్ని చెలరేపుతుంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రహదారి పైన, పక్కన ఉన్న సుమారు 46 మైసమ్మ ఆలయాలను గత బుధవారం అర్ధరాత్రి దాటాక ముకుమ్మడిగా కూల్చివేశారు. రహదారి భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని కార్పొరేషన్ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హిందువులు భక్తికి విశ్వాసానికి ప్రతీకగా భావించే ఆలయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అర్థరాత్రి కూల్చివేయడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అధికారులు అవలంబించిన ఈ వైఖరిని ఖండిస్తూ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. బాధ్యులైన అధికారుల పై చర్యలు చేపట్టి కూల్చివేసిన ఆలయాలను అదే ప్రదేశంలో పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
స్థానికంగా కలకలాన్ని సృష్టించిన ఈ ఘటన క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కనసన్నలోనే ఆలయాల కూల్చివేత జరిగిందని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, ఆలయాలను పునర్నిర్మించేంతవరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే అధికారులు అత్యుత్సాహంతో ఈ తప్పిదానికి పాల్పడ్డారని స్థానిక ఎమ్మెల్యేకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టడంతో పాటు ఆలయాల పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అర్ధరాత్రి 46 దేవాలయాలను కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో కూల్చివేసిన ఆలయాలన్నింటిని యధా స్థానంలో పునర్ నిర్మించాలని, లేదంటే తానే స్వయంగా వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న దర్గాలను తొలగిస్తానని అల్టిమేటo జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు ఏం చేయాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇదిలా ఉంటే శనివారం రోజు రాత్రి సమయంలొ కూల్చివేసిన అలయాలని తిరిగి మళ్ళీ రొడ్డుప్రక్కన నిర్మాణం చేసారు.
Also Read: శ్రీలీల ఐటమ్ సాంగ్‌లా కేటీఆర్ ప్రచారం: సీఎం రేవంత్
రోడ్ల వెడల్పు, పునర్నిర్మాణం పేరిటా హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా అలయాలని కూల్చివేయడం కరెక్ట్ కాదని కేంద్రమంత్రి బండిసంజయ్ కలెక్టర్ తో మాట్లడడమే కాకుండా తిరిగి నిర్మాణం చెయ్యకపోతే తానే స్వయంగా వస్తానని హెచ్చరించడం తో ఇప్పుడు అధికారులు కేవలం రొడ్ల విస్తారణ కొసం మాత్రమే కూలగొట్టి ప్రక్కన నిర్మాణం చేస్తామని తెలపడం తో వివాదం ఇప్పుడు సద్దుమణిగింది