BigTV English

Kothagudem : కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. బీఆర్ఎస్‌ చీలిక సీపీఐకి కలిసి రానుందా?

Kothagudem : కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. బీఆర్ఎస్‌ చీలిక సీపీఐకి కలిసి రానుందా?

Kothagudem : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలందర్నీ హస్తం గూటికి తీసుకురావడంలో ఈ ఇద్దరు నేతలు సక్సెస్‌ అయ్యారు. వీళ్లిద్దరి దూకుడుతో బెంబేలెత్తుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌ సహా మిగతా ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రితో వరుస సభలు ప్లాన్‌ చేస్తూ గండం నుంచి గట్టెక్కేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్‌దే హవా అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండా.. పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొత్తగూడెంలో AIFB నుంచి పోటీ చేస్తున్న జలగం వెంకట్రావు గులాబీకి కొరకరాని కొయ్యగా మారారు.


కొత్తగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి సీపీఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పోటీలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. అయితే వనమా వెంకటేశ్వరరావుకి పుత్రుడు రూపంలో నియోజకవర్గంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపు కష్టమే అనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్‌ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్ (AIFB) అభ్యర్థిగా బరిలో దిగారు. అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. తన కుటుంబానికి ఉన్న పలుకుబడి, స్వతంత్రులను గెలిపించే కొత్తగూడెం ప్రజల ఓటర్ల ఆశీర్వాదాలు తనకు దక్కుతాయని జలగం అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో జలగం కుటుంబానిది ప్రత్యేక పాత్ర. జలగం కుటుంబ సభ్యుల పేరు తెలియని వారుండరు. జలగం వెంగళ్ రావు ముఖ్యమంత్రిగా పనిచేయడమే అందుకు కారణం. ఇప్పుడు అలాంటి కుటుంబానికి తగిన గుర్తింపు దక్కడం లేదనే చర్చ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది. జలగం వెంకట్రావు మాత్రమే వెంగళ్ రావు కుటుంబం నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. జలగం వెంకట్రావు రాజకీయ జీవితానికి కేసీఆర్‌ బ్రేక్‌ వేశారు. తనను అవమానించిన పార్టీని ఓడించి శాసనసభలో అడుగు పెట్టాలని జలగం వెంకట్రావు పట్టుదలతో ఉన్నారు. ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు.


2014లో బీఆర్ఎస్‌ అభ్యర్థిగా జలగం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావుపై 16,521 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కావడం విశేషం. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీ ఫిరాయించిన వనమా గులాబీ గూటికి చేరారు. ఈసారి టికెట్‌ దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి తీరుతో అసంతృప్తి చెందిన జలగం బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బలమైన పరిచయాలు కలిగిన నేతగా జలగం వెంకట్రావుకు పేరుంది. వనమాను ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్నారు. ఈ ఈక్వేషన్స్‌ అన్నీ కాంగ్రెస్‌-సీపీఐ అభ్యర్థి కూనంనేనికి కలిసి రానున్నాయనే చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకి గత పనితీరు మైనస్‌ అవుతోంది. ఆయన కుమారుడు వనమా రాఘవ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఓ కుటుంబం సజీవ దహనం చేసుకునేందు కారణమై జైలు పాలవడం సంచలనం రేపింది. అవినీతి ఆరోపణలు, ఇసుక దందాలు, భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తారనే ముద్ర ఉంది. అయినా సీఎం కేసీఆర్ వనమాకే మద్దతు తెలపడం నియోజకవర్గ ప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. రాఘవను పార్టీ నుంచి బహిష్కరించామనే ప్రకటన చేసినా ప్రచారంలో కనిపించడంపై జనం భగ్గుమంటున్నారు.

వనమా రాఘవపై కౌన్సిలర్లు కూడా కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వనమా విజయానికి కలిసి పనిచేసేలా హైకమాండ్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆయన జోక్యంతో పైకి అసంతృప్తి చల్లారినట్లే కనిపిస్తున్నా లోలోపల నేతలు రగిలిపోతున్నారు. వనమా కుటుంబానికి భారీ షాక్‌ ఇవ్వడం ఖాయమని నియోజకవర్గంలో టాక్‌ నడుస్తోంది. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు జలగం వెంకట్రావుతో జట్టు కట్టారు. పరిస్థితులు అన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని ఎలాగైనా సభలో అడుగుపెట్టాలని జలగం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

కొత్తగూడెంలో కార్మిక సంఘాల మద్దతుకు తోడు.. కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావుకు గులాబీలో చిచ్చు కలిసి వచ్చేలా చేస్తోంది. అధికార పార్టీ ఓట్లు జలగం వెంకట్రావ్‌, వనమా వెంకటేశ్వరరావు మధ్య చీలిపోతే సీపీఐ విజయం మరింత సులువు కానుంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేసే బాధ్యతలను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు భుజానికెత్తుకున్నారు. అస్త్రశస్త్రాలు బయటకు తీస్తూ అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతానికి కొత్తగూడెంలో త్రిముఖ పోరు కనిపిస్తుండగా.. ఎన్నికల నాటికి ఏకపక్షం కానుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలు.. సీపీఐ అభ్యర్థి విజయానికి గ్యారెంటీ ఇస్తాయని నేతలు ధీమాగా ఉన్నారు.

.

.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×