ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రదేశాలు ప్రకృతి అద్భుతాలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మిడ్ నైట్ సన్ ఎక్స్ పీరియెన్స్ అందించే దేశాలు. అంటే, అక్కడ అర్థరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, అక్కడ కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు సూర్యాస్తమయం అనేది ఉండదు. రాత్రి అయినా కూడా వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇంతకీ భూమిపై సూర్యుడు అస్తమించని 8 అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నార్వేలోని స్వాల్ బార్డ్ ఏప్రిల్ చివరి నుంచి ఆగస్టు చివరి వరకు ఇక్కడ సూర్యుడు పూర్తిగా అస్తమించడు. అర్ధరాత్రి సమయంలో కూడా పగటిపూట లాగే వెలుతురు కనిపిస్తుంది. ఈ సమయంలో అక్కడి ప్రజలు హైకింగ్, పడవ ప్రయాణాలు, పండుగలు జరుపుకుంటారు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం నిజంగా స్వర్గంలాంటి ప్రదేశం.
అమెరికాలోని అలస్కాలో ఉన్న ఉట్కియాగ్విక్ ప్రాంతంలో కూడా మే చివరి నుంచి జూలై చివరి వరకు సూర్యకాంతి కనినిస్తూనే ఉంటుంది. ఇక్కడ బంగారు రంగులో మెరిసే అర్ధరాత్రి ఆకాశం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆర్కిటిక్ వన్యప్రాణులు, మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
కెనడాలోని నునావత్ ప్రాంతం కూడా ఎప్పుడూ వెలుతురును కలిగి ఉంటుంది. ఇక్కడ రెండు నెలల పాటు సూర్యుడు అస్తమించడు. హిమానీనదాలు, మంచు ప్రాంతాలు, అడవి జీవులు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మార్చుతాయి. ఫోటోగ్రాఫర్లకు ఇదో అద్భుతమైన ప్రదేశంగా చెప్పొచ్చు.
ఫిన్లాండ్ లో వేసవి కాలంలో దాదాపు 73 రోజుల పాటు సూర్యరశ్మి కనిపిస్తుంది. మే చివరి నుంచి జూలై మధ్య వరకు అక్కడ రాత్రి చీకటి పూర్తిగా ఉండదు. ఈ సమయంలో స్థానికులు మిడ్ నైట్ సెలబ్రేషన్స్, చేపల వేట, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. పర్యాటకులు కూడా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందుతారు.
ఐస్ లాండ్ లో జూన్ నెలలో రాత్రి కూడా సంధ్యా సమయంలా కనిపిస్తుంది. ముఖ్యంగా రేక్ జావిక్ ప్రాంతంలో దాదాపు 24 గంటల పాటు వెలుతురు ఉంటుంది. ఈ సమయంలో పర్యాటకులు అగ్నిపర్వత ప్రాంతాలు, జలపాతాలు, ప్రకృతి అందాలను చూసేందుకు తరలివస్తారు.
స్వీడన్ లోని కిరునా పట్టణంలో కూడా మే చివరి నుంచి జూలై మధ్య వరకు సూర్యుడు అస్తమించడు. అక్కడి మంచు పర్వతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
రష్యాలోని ముర్మాన్స్క్ ప్రాంతంలో మే చివరి నుంచి జూలై వరకు సూర్యాస్తమయం ఉండదు. ఆర్కిటిక్ అందాలు, ప్రత్యేక సంస్కృతి ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మార్చుతుంది.
అంటార్కిటికాలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సూర్యుడు 24 గంటలూ ప్రకాశిస్తాడు. మంచుతో కప్పబడిన ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు, అన్వేషకులు ఈ ప్రత్యేక అనుభవాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ ప్రాంతం ప్రకృతి అద్భుతాలకు నిలయంగా కొనసాగుతోంది.
Read Also: శ్రీలంక బంపర్ ఆఫర్.. ఇండియన్ టూరిస్టులకు ఫ్రీ వీసా!