Sivok-Rangpo Railway Project: భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింకు తొలిసారిగా రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ అందించే దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని సివోక్ నుంచి సిక్కింలోని రాంగ్‌పో వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ లో అత్యంత పొడవైన టన్నెల్ తవ్వకం పనులు పూర్తయ్యాయి. దాదాపు ఇదే పొడవుతో కూడిన ప్రాజెక్టులోని మొత్తం 14 సొరంగాల తవ్వకం పనులు కంప్లీట్ అయ్యాయి.
సివోక్-రాంగ్‌పో రైల్వే ప్రాజెక్టు మొత్తం పొడవు 45 కిలోమీటర్లు. ఇందులో భాగంగా నిర్మిస్తున్న 5.3 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నంబర్ 10 తవ్వకం తాజాగా పూర్తయింది. రైల్వేశాఖ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టులోని మొత్తం 14 సొరంగాల తవ్వకం పూర్తవడం నిర్మాణ పనుల్లో పెద్ద ముందడుగు పడినట్లు అధికారులు వెల్లడించారు.
సొరంగాల తవ్వకం పూర్తికావడంతో.. ఇక లోపలి లైనింగ్ ఏర్పాటు చేయడం, రైల్వే ట్రాక్‌లు వేయడం, సిగ్నలింగ్, ఇతర భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వాస్తవానికి ఈ మార్గం నిర్మాణం సాధారణమైనది కాదు. హిమాలయ పర్వత ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన భూభాగం గుండా ఈ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం మార్గంలో సుమారు 86 శాతం దూరం సొరంగాల గుండా సాగుతుంది. అంతేకాకుండా ప్రాజెక్టులో 23 వంతెనలను కూడా నిర్మిస్తున్నారు.
ఈ రైల్వే మార్గంలో సివోక్, రియాంగ్, మెల్లి, రాంగ్‌పో అనే నాలుగు స్టేషన్లు ఉంటాయి. వీటితో పాటు తీస్తా బజార్ దగ్గర భూగర్భ హాల్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు. సివోక్ దగ్గర ఈ కొత్త లైన్ ఇప్పటికే ఉన్న న్యూ జల్పైగురి-అలీపుర్దువార్ రైల్వే మార్గంతో లింక్ కానుంది. దీంతో సిక్కిం నేషనల్ రైల్వే నెట్‌వర్క్ లోకి రానుంది.
ప్రస్తుతం సిక్కింకు వెళ్లాలంటే రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారి 10 (NH-10) ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం లాంటి పరిస్థితుల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు రోడ్డు మార్గానికి ప్రత్యామ్నాయం లభిస్తుంది. పర్యాటకులు సులభంగా సిక్కింకు చేరుకోవడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణా కూడా మెరుగుపడుతుంది.
Read Also: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. జల్నా నుంచి మరో 4 ప్రత్యేక రైళ్లు!