రక్తం, నీరు కలసి ప్రవహించలేవు అంటూ ఇటీవల ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈవ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టెర్రరిజం, టూరిజం అనేవి రెండూ ఒకే చోట ఉండకూడదనే కొత్త స్లోగన్ మొదలైంది. ఈ నినాదంతో భారత్, టర్కీకి కాస్త గట్టిగానే బుద్ధి చెప్పేందుకు నిర్ణయించింది.
ఒకప్పుడు టర్కీలో భూకంపే వస్తే మొదటగా స్పందించింది భారత్ ప్రభుత్వం. ఆపరేషన్ దోస్త్ పేరుతో ఆర్థిక సాయంతోపాటు, అత్యవసరమైన మందులు, నిత్యావసరాలు కూడా పంపించి ఆదుకుంది. కానీ దానికి ప్రతిఫలం. నేడు భారత్-పాక్ యుద్ధంలో టర్కీ, పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చింది. అంతే కాదు, ఆయుధాలు కూడా సమకూర్చింది. టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్, భారత్ పై దాడికి ప్రయత్నించింది. ఇలాంటి సమయంలోనే మనకు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. టర్కీకి మనం పాలుపోసి పెంచినా అది చివరకు విషమే చిమ్మింది. మరి దీనికి విరుగుడు కూడా మనం కనిపెట్టాలి కదా. అసలు టర్కీ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొడితే పోలా..? ఆ దెబ్బ మామూలుగా ఉండకూడదు. పాకిస్తాన్ కి ఎందుకు సహాయం చేశామా అని టర్కీ కుమిలి కుమిలి ఏడవాలి..? భారత్ తో ఎందుకు గొడవ పెట్టుకున్నామా అని పశ్చాత్తాపంతో కుంగిపోవాలి. సరిగ్గా అలాంటి నిర్ణయాలనే భారత్ తీసుకుంటోంది. టర్కీని చావుదెబ్బ కొడుతోంది.
టూరిజం బ్యాన్..
టర్కీకి, భారత్ కి ఎలాంటి గొడవలు లేవు. కానీ టర్కీ, పాకిస్తాన్ రూపంలో దారినపోయే దరిద్రాన్ని తగిలించుకుంది. అంతే, ఇప్పుడు టర్కీ టూరిజం ఢమాల్ అంది. టూరిజంపై టర్కీకి అత్యధికంగా ఆదాయం వస్తుంది. అందులోనూ భారత పర్యాటకులు ఎక్కువమంది టర్కీకి వెళ్తుంటారు. ఇకపై భారత్ లో విదేశీ టూర్లను ప్లాన్ చేసే ట్రావెల్ ఏజెన్సీలు టర్కీని లిస్ట్ లోనుంచి తీసేయాలని అనధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో టర్కీ టూరిజాన్ని భారత్ బ్యాన్ చేసినట్టయింది. బాయ్ కాట్ టర్కీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ మొదలయ్యాక భారత్ నుంచి టర్కీ టూరిజం 80శాతం తగ్గింది. చాలామంది టూర్లు క్యాన్సిల్ చేసుకున్నారు. కరోనా తర్వాత ప్రతి ఏడాదీ టర్కీ టూరిజం 20శాతం పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది అది పూర్తిగా పడిపోయింది. పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్న టర్కీ, అజర్ బైజాన్ వంటి దేశాలను టూరిస్టులే వద్దనుకుంటున్నారు. ఆరు రోజుల్లో టర్కీ, అజర్ బైజాన్ వెళ్లాల్సిన టూరిస్టులు 50శాతం మంది తమ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. మేక్ మై ట్రిప్ సైట్లో క్యాన్సిలేషన్లు 250 శాతం పెరిగాయి. దాదాపుగా ఇవన్నీ టర్కీ టూర్ వే కావడం విశేషం. ఇక ఈజీమై ట్రిప్ కూడా 22శాతం క్యాన్సిలేషన్లు పెరిగినట్టు తెలిపింది.
అంతకు మించి..
కేవలం టూరిస్ట్ లను ఆపితే మజా ఏముంటుంది. టర్కీ నుంచి వచ్చే దిగుమతులపై కూడా భారత వ్యాపారులు స్వచ్ఛందంగా బ్యాన్ విధించారు. టర్కీ యాపిల్స్ కి ఈసీజన్ లో భారత్ లో డిమాండ్ ఎక్కువ. ఈ యాపిల్స్ వ్యాపారమే దాదాపు 1200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ సీజన్ లో ఈ 1200 కోట్లు టర్కీకి వెళ్లవు. ఆ మేరకు మన వ్యాపారులు టర్కీ వ్యాపారాన్ని రద్దు చేసుకున్నారు. ఆ దేశం నుంచి వచ్చిన యాపిల్స్ ని తిప్పి పంపించేస్తున్నారు.
మార్బుల్స్ కూడా..
టర్కీ మార్బుల్స్ కి భారత్ తో పాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ మార్బుల్స్ ని కూడా మన వ్యాపారులు తీసుకోవడం లేదు. టర్కీ మార్బుల్స్ ఇక మాకొద్దు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే టర్కీకి మార్బుల్స్ ని ఆర్డర్ పెట్టిన స్థానిక వ్యాపారులు వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గతంలో మా వద్ద టర్కీ యాపిల్స్ అమ్మబడును, మా షాపులో టర్కీ మార్బుల్స్ ప్రత్యేకం అని గొప్పగా చెప్పుకునే వ్యాపారులు సైతం ఇప్పుడు తమవద్ద టర్కీ సరుకు లేదు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద పాకిస్తాన్ కి లేనిపోని సహాయం చేసి టర్కీ తిప్పలు కొని తెచ్చుకుంది. భారత్ ఆగ్రహానికి బలైపోతోంది.