ప్రయాణీకుల దగ్గర భోజనం కోసం డబ్బులు వసూలు చేసే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కి.. నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని న్యూఢిల్లీ వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది. పూర్వా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ప్యాసింజర్ కు అందించిన వెజ్ బిర్యానీలో చనిపోయిన పురుగు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అపరిశుభ్రమైన ఆహారాన్ని వడ్డించిన IRCTCని దోషిగా తేల్చింది. బాధితుడికి పరిహారంగా రూ.25,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మోనికా ఎ. శ్రీవాస్తవ, కిరణ్ కౌశల్ తో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
డిసెంబర్ 28, 2018న ఓ ప్రయాణీకుడు పూర్వా ఎక్స్ ప్రెస్ లో న్యూఢిల్లీ నుంచి జార్ఖండ్ కు ప్రయాణిస్తున్నాడు. జర్నీలో అతడు IRCTC పాంట్రీ కారు నుంచి వెజ్ బిర్యానీ ప్లేట్ ను రూ. 80కి కొనుగోలు చేశాడు. ఫుడ్ తింటుండగా ఆహారంలో తేడాగా అనిపించింది. పరిశీలించి చూసి షాకయ్యాడు. బిర్యానీలో చనిపోయిన తెల్ల పరుగు కనిపించింది. ప్రయాణీకుడు కాసేపట్లోనే అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డాడు. ఒంటరిగా జర్నీ చేస్తున్న కారణంగా సరైన చికిత్స కూడా అందించలేదు. అతడు వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేసి విషయం చెప్పాడు. కానీ, తను ఫిర్యాదు చేసిన తర్వాత IRCTC కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. వెంటనే ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. అతడు రైలు దిగే సమయానికి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.
Read Also: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!
ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రయాణీకుడు IRCTCపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. తనకు అందించిన ఫుడ్ లోని పురుగు ఫోటోలు, తను హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత చికిత్సకు అయిన ఖర్చు వివరాలు, రైలు టికెట్, ఫుడ్ కోసం చెల్లించిన డబ్బుల వివరాలు అన్నీ సమర్పించాడు. తనకు కలిగిన అసౌకర్యానికి ఏకంగా రూ. 5 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత.. ఫిర్యాదుదారుడి ఆవేదనలో న్యాయం ఉందని వినియోగదారుల ఫోరం నిర్దారణకు వచ్చింది. IRCTC అందించిన అపరిశుభ్ర ఆహారం కారణంగా ప్రయాణీకుడు ఎంతో మానసిక వేదన అనుభవించాడని అభిప్రాయానికి వచ్చింది. ఫిర్యాదుదారుడి మానసిక, శారీరక ఇబ్బందికి IRCTC బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. కలుషితమైన ఆహారం తిని ఆరోగ్యానికి గురైన ప్రయాణీకుడికి పరిహారంగా రూ.25,000 చెల్లించాలని ధర్మాసనం IRCTCని ఆదేశించింది. IRCTC క్షమాపణలు చెప్పడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వెల్లడించింది. వినియోగదారుల ఫోరం తీర్పుతో బాధిత ప్రయాణీకుడు సంతోషం వ్యక్తం చేశాడు. 7 ఏళ్ల తర్వాత అయినా న్యాయం జరగడం సంతోషంగా ఉందన్నాడు.
Read Also: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!