దేశంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఛత్తీస్ గఢ్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో 11 మంది చనిపోగా, ఇవాళ ఉదయం ఉత్తర ప్రదేశ్ లో పట్టాలు దాటుతున్న ప్రయాణీకులను ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ డెడ్ అయ్యారు. తాజాగా ముంబైలో మరో రైలు ప్రమాదం జరిగింది. మోనో రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పాట్ కు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇవాళ ఉదయం వడాలా డిపోలో టెస్ట్ రన్ సమయంలో ముంబై మోనోరైల్ రైలు ఓ వైపు వంగిపోయింది. ఈ రైలులో ప్రయాణికులు ఎవరూ లేరు. లోకో పైలెట్స్ కు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెస్క్యూ సిబ్బంది వారిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. సిగ్నలింగ్ ట్రయల్స్ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంతో కొంత మేర ట్రాక్ దెబ్బతిన్నది. పదే పదే వస్తున్న సాంకేతిక సమస్యల కారణంగా మోనోరైల్ సేవలను అధికారులు ఇప్పటికే నిలిపివేశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు స్పందించారు. “ఇవాళ ఉదయం ముంబైలోని వడాలా డిపోలో టెస్ట్ రన్ సమయంలో మోనోరైల్ రైలు వంగిపోయింది. ప్రమాద సమయంలో ఇద్దరు లోకో పైలెట్లు మాత్రమే ఉన్నారు. రైలు లోపల ప్రయాణికులు లేరు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, కొంత మేర ట్రాక్ దెబ్బతిన్నది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే దెబ్బతిన్న ట్రాక్ ను సరిచేస్తాం” అని అధికారులు తెలిపారు.
అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రైలు ఒకవైపు వంగిపోయినట్లు కనిపిస్తోంది. ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మోనో రైల్ లోకో పైలెట్స్ ను రక్షించినట్లు తెలిపారు.
VIDEO | Mumbai: A Monorail train’s coach undergoing testing at Wadala met with an accident after it derailed and hit a structure. The motorman sustained injuries and was rescued from the spot. The alignment of the train was damaged in the incident. Officials from the MMRDA and… pic.twitter.com/KAmOQj0kvG
— Press Trust of India (@PTI_News) November 5, 2025
నిజానికి పదే పదే టెక్నికల్ సమస్యలు రావడంతో ముంబైలో మోనోరైల్ సేవలను సెప్టెంబర్ 20 నుంచి నిలిపివేశారు. సిస్టమ్ అప్‌గ్రేడేషన్ పనుల కోసం తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 15, ఆగస్టు 19న వేర్వేరు ప్రదేశాలలో రెండు మోనోరైళ్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. మార్గం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు మోనో రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారుతు తెలిపారు.