Pelling Travel: బిజీ లైఫ్, సిటీ గోల, ట్రాఫిక్ సౌండ్స్.. వీటన్నింటికీ దూరంగా, మేఘాల చాటున దాగి ఉన్న ఒక అందమైన లోకానికి వెళ్లాలని ఉందా? హిమాలయాల చల్లని గాలి మిమ్మల్ని తాకుతుంటే, ఎదురుగా మంచుతో కప్పబడిన శిఖరాలు దర్శనమిస్తుంటే.. ఆ అనుభూతే వేరు. ఈ వారం యాత్రలో భాగంగా సిక్కిం రాష్ట్రంలో.. వెస్ట్ సిక్కిం జిల్లాలో ఉన్న ఒక చిన్న స్వర్గం..అదే పెల్లింగ్‌కు మిమ్మిల్ని తీసుకెళ్తున్నాను. పదండి…అక్కడి అందాలను ఆస్వాదిద్దాం..
సముద్ర మట్టానికి దాదాపు 2,150 మీటర్ల ఎత్తులో ఉన్న పెల్లింగ్, పశ్చిమ సిక్కింలోని ఒక అపురూపమైన పర్యాటక కేంద్రం. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే.. ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శిఖరం మౌంట్ కాంచనజంగ ఇక్కడి నుండి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. ఇక్కడి ఆకాశం తేటగా మారి, ఆ మంచు కొండలను ఒక అద్భుత చిత్రంలా మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇక్కడి వాతావరణం 7 డిగ్రీల సెల్సియస్ నుంచి 18 డిగ్రీల సెల్సీయస్ మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
పెల్లింగ్ వెళ్లిన వారు అస్సలు మిస్ కాకూడనిది స్కైవాక్. ఇది భారతదేశపు మొట్టమొదటి గ్లాస్ స్కైవాక్. పాదాల కింద పారదర్శకమైన గాజు, కింద వందల అడుగుల లోతైన లోయ.. ఆ పైన నీలి ఆకాశం. ఇక్కడ నడుస్తుంటే గాలిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. సాహసాన్ని ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప అనుభవం. ఈ స్కైవాక్ నేరుగా భారీ చెన్రేజిగ్ విగ్రహానికి దారి తీస్తుంది. స్కైవాక్ చివరన మనకు కనిపించేది 137 అడుగుల ఎత్తైన చెన్రేజిగ్ విగ్రహం. ఇది శాంతికి, కరుణకు చిహ్నం. కొండ పైన కొలువై ఉన్న ఈ విగ్రహం చుట్టూ ఉన్న పరిసరాలు మన మనసుకి ఎనలేని ప్రశాంతతను ఇస్తాయి. ఆధ్యాత్మికతను కోరుకునే వారికి ఇదొక దివ్యధామం.
పెల్లింగ్ కేవలం ప్రకృతి అందాలే కాదు.. సంప్రదాయాలకు కూడా ఈ ప్రదేశం నిలయం. 1705లో నిర్మించిన పెమాయాంగ్ట్సే మోనాస్టరీ సిక్కింలోని అతి పురాతనమైన మఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పకళ, పురాతన గ్రంథాలు, టిబెటన్ శైలి పెయింటింగ్స్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా ఇక్కడి ఏడు అంతస్తుల చెక్క కట్టడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. చరిత్రను ప్రేమించే వారికి రబ్డెంట్సే శిథిలాలు ఒక టైమ్ మెషిన్ లాంటివి. ఒకప్పుడు సిక్కిం రాజ్యానికి ఇది రెండవ రాజధాని. నేడు శిథిలావస్థలో ఉన్నా.. ఆనాటి రాజుల వైభవాన్ని ఇవి చాటిచెబుతాయి. దట్టమైన అడవి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం. ఇక్కడి నుండి కాంచనజంగ శిఖరం కనిపించే తీరు పర్యాటకులను కట్టిపడేస్తుంది.
ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉండదు. అది జలపాతాల రూపంలో పాడుతూనే ఉంటుంది. పెల్లింగ్ సమీపంలోని సాంగే జలపాతం చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. కొండల మధ్య నుండి వెండి జలపాతంలా కిందకు దూకే నీరు.. ఆ చల్లటి తుంపర్లు మన అలసటనంతా మాయం చేస్తాయి. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక స్వర్గం.
పశ్చిమ సిక్కింలోని పెల్లింగ్ సమీపంలో ఉన్న పవిత్రమైన ఖేచోపాల్ ట్రీ సరస్సు.సముద్ర మట్టానికి సుమారు 1,700 మీటర్ల ఎత్తులో, ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఖేచోపాల్ ట్రీ సరస్సు.. పర్యాటకులను, ఆధ్యాత్మిక ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. పశ్చిమ సిక్కింలోని పెల్లింగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ సరస్సును బౌద్ధులు, హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు దీనిని కోరికలు తీర్చే సరస్సు అని పిలుస్తారు. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ సరస్సు ఆకారం ఒక పాదముద్ర వలె ఉంటుంది. బౌద్ధుల నమ్మకం ప్రకారం ఇది తారా దేవి పాదముద్ర అని, హిందువుల ప్రకారం ఇది శివుడి పాదముద్ర అని నమ్ముతారు. ఈ సరస్సు గురించి ప్రచారంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశం అక్కడి పక్షుల ప్రవర్తన. సరస్సు చుట్టూ దట్టమైన అడవి ఉన్నప్పటికీ, నీటిపై ఒక్క ఆకు కూడా పడకుండా పక్షులు జాగ్రత్త పడతాయని స్థానికులు చెబుతారు.
పశ్చిమ సిక్కిం పర్యటనలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలలో రింబి వాటర్ ఫాల్స్. పెల్లింగ్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రింబి జలపాతం..రింబి నది నుండి ఉద్భవిస్తూ.. ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నీటిలో అరుదైన అస్సామీ కార్ప్, ట్రౌట్ చేపలు కనిపిస్తాయి.
సౌందర్యవంతమైన పెల్లింగ్‌కు సమీపంలో బాగ్డోగ్రా విమానాశ్రయం ఉంది. ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడి నుంచి టాక్సీ, బస్సుల్లో పెల్లింగ్ చేరుకోవచ్చు. పెల్లింగ్‌కు సమీపంలో న్యూ జల్పాయ్ గురి రైల్వే స్టేషన్ ఉంది. ఇది పెల్లింగ్ నుండి సుమారు 135 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని ముఖ్య ప్రాంతాల నుండి పెల్లింగ్‌కు రోడ్డు మార్గం ఉంది. సిక్కిం రాజధాని గాంగ్టక్ నుండి పెల్లింగ్ సుమారు 120 కిలో మీటర్ల దూరం. ఇక్కడి నుంచి బస్సులు, టాక్సీల ద్వారా 4 నుండి 5 గంటల్లో చేరుకోవచ్చు.
Also Read: ఉత్తరాఖండ్ ‘ఫ్రూట్ బౌల్’ గురించి తెలుసా? ఆపిల్ తోటల మధ్య అద్భుతమైన వీకెండ్ డెస్టినేషన్!
Story by: Kanugula Kishan, Big Tv