E-Paper
Advertisement

Mukteshwar Tourism: ఉత్తరాఖండ్ ‘ఫ్రూట్ బౌల్’ గురించి తెలుసా? ఆపిల్ తోటల మధ్య అద్భుతమైన వీకెండ్ డెస్టినేషన్!

Mukteshwar Tourism: ఉత్తరాఖండ్ ‘ఫ్రూట్ బౌల్’ గురించి తెలుసా? ఆపిల్ తోటల మధ్య అద్భుతమైన వీకెండ్ డెస్టినేషన్!

Mukteshwar Tourism: ఉత్తరాఖండ్‌లోని కుమాన్ కొండల్లో దాగి ఉన్న ఒక అందమైన కావ్యం ముక్తేశ్వర్. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదేశం.. సముద్ర మట్టానికి ఏడున్నర వేల అడుగుల ఎత్తులో, మేఘాల అంచున కొలువుదీరింది. ముక్తేశ్వర్‌ గురించి ఈ వారం యాత్రలో తెలుసుకుందాం..

పకృతి ప్రేమికులకు స్వర్గం

నైనిటాల్‌కు కేవలం 51 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న గ్రామం ముక్తేశ్వర్. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం. ఇక్కడ అడుగుపెట్టగానే చుట్టూ పరుచుకున్న ఓక్, దేవదారు వృక్షాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడి నుండి కనిపించే నందాదేవి మంచు శిఖరాల దృశ్యం వర్ణనాతీతం. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయం. సుమారు 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన శివాలయం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. పాండవులు కూడా ఇక్కడికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. కళింగ వాస్తుశిల్ప శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శాంతితో పాటు హిమాలయాల 360 డిగ్రీల అద్భుత దృశ్యాన్ని మనకు అందిస్తుంది.

థ్రిల్లింగ్ యాక్టివిటీస్

చౌలీ కీ జాలీ.. సాహసాలకు చిరునామా. చౌలీ అంటే రాయి, జాలీ అంటే జల్లెడ. ఇక్కడి రాళ్లకు సహజంగానే పెద్ద పెద్ద రంధ్రాలు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయం వెనుక భాగంలోనే ఈ రాతి కొండలు ఉన్నాయి. ఇక్కడి రాళ్లు నిటారుగా ఉండటం వల్ల రాక్ క్లైంబింగ్‌కు ఇవి సవాలుతో కూడిన అనుభూతిని ఇస్తాయి. స్థానిక అడ్వెంచర్ ఆపరేటర్లు ఇక్కడ శిక్షకులను అందుబాటులో ఉంచుతారు. వారు మీకు అవసరమైన తాడులు , హార్నెస్, భద్రతా పరికరాలను అందిస్తారు. రాక్ క్లైంబింగ్‌తో పాటు ఇక్కడ మరికొన్ని థ్రిల్లింగ్ యాక్టివిటీస్ చేయవచ్చు.

ఏడాది పొడవునా ప్రవహించే జలపాతం

ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్ సమీపంలో ఉన్న భాలు గాడ్ జలపాతం.. ప్రకృతి ఒడిలో జలసిరిగా పిలుస్తారు. స్థానిక భాషలో భాలు అంటే ఎలుగుబంటి, గాడ్ అంటే చిన్న నీటి ప్రవాహం అని అర్థం. ఒకప్పుడు ఈ జలపాతం ఉన్న అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించేవని. అవి ఇక్కడ నీరు తాగడానికి వచ్చేవి అని స్థానికులు చెబుతారు. అందుకే దీనికి భాలు గాడ్ అని పేరు వచ్చింది. ఇది సుమారు 60 అడుగుల ఎత్తు నుండి జాలువారే అద్భుతమైన జలపాతం. ఈ జలపాతం ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. నీరు పైనుండి పడే చోట కింద ఒక స్పష్టమైన, చల్లని నీటి కొలను ఏర్పడుతుంది. పర్యాటకులు ఇక్కడ సురక్షితంగా స్నానం చేయవచ్చు. ఈ జలపాతానికి చేరుకోవడమే ఒక గొప్ప సాహసం. ప్రధాన రహదారి నుండి జలపాతం వరకు సుమారు 1.5 నుండి 2 కిలోమీటర్ల మేర అడవిలో నడవాల్సి ఉంటుంది. దట్టమైన వృక్షాలు, చిన్న చిన్న వాగులు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మార్గం అంతా పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇక్కడికి వెళ్తే ప్రకృతి ఒడిలో ఉన్నట్టే..

ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్ సమీపంలో ఉన్న సీత్లా, ప్యూరా అనే గ్రామాలు ఆపిల్ తోటలకు, ప్రశాంతతకు మారుపేరు. పర్యాటక రద్దీకి దూరంగా, ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారికి ఇవి అసలైన స్వర్గధామాలు.
సీత్లా సుమారు 7,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. ఇది ముక్తేశ్వర్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీత్లాలో ఎటు చూసినా ఆపిల్, ప్లమ్, పీచెస్, ఆప్రికాట్ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ 150 ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ కాలపు రాతి భవనాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు లగ్జరీ హోమ్‌స్టేలుగా మార్చారు. తోటల మధ్య ఉన్న ఈ పాతకాలపు బంగళాల్లో బస చేయడం ఒక గొప్ప అనుభూతి.
పచ్చని అడవులు, పండ్ల తోటల వల్ల ఇక్కడికి రంగురంగుల హిమాలయ పక్షులు వస్తుంటాయి. పక్షుల కిలకిలరావాల మధ్య ఉదయం నడక సాగించడం ఇక్కడ ఎంతో ప్రత్యేకం.

ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఉత్తరాఖండ్

ప్యూరాను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అని పిలుస్తారు. ఇది ముక్తేశ్వర్, అల్మోరా మధ్యలో ఉన్న ఒక చిన్న పర్యావరణ హిత గ్రామం. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటికి ఒక పండ్ల తోట ఉంటుంది. పర్యాటకులు ఈ తోటల్లో తిరుగుతూ తాజా పండ్లను కోసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడి జ్యూస్‌లు, జామ్‌లు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ప్యూరా గ్రామం నుండి హిమాలయాల మంచు శిఖరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి వేళ ఇక్కడి నుండి లోయలో ఉన్న అల్మోరా పట్టణ దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి. ఇక్కడ వాణిజ్య హోటళ్ల కంటే స్థానిక పహాడీ ఇళ్లే పర్యాటకులకు బస కల్పిస్తాయి. మట్టితో కట్టిన ఇళ్లు, స్థానిక కట్టె పొయ్యి మీద వండిన కుమానీ వంటకాలు ఇక్కడి స్పెషల్.

చరిత్రపై ఆసక్తి ఉందా.. అయితే తప్పక చూడాల్సిందే..

ఉత్తరాఖండ్‌లోని ముక్తేశ్వర్ కేవలం ప్రకృతి అందాలకే కాదు, భారతీయ శాస్త్రీయ పరిశోధనా చరిత్రకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మ్యూజియం విజ్ఞాన శాస్త్రం, చరిత్రపై ఆసక్తి ఉన్నవారు తప్పక చూడాల్సిన ప్రదేశం. బ్రిటిష్ పాలన కాలంలో 1893లో ఈ కేంద్రాన్ని ముక్తేశ్వర్‌లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్నప్పటికీ, ముక్తేశ్వర్ క్యాంపస్ దాని చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి. ఆ రోజుల్లో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు ఇక్కడ తయారు చేసేవారు. 19వ శతాబ్దపు చివరి కాలంలో..20వ శతాబ్దపు ప్రారంభంలో శాస్త్రవేత్తలు వాడిన అత్యంత అరుదైన మైక్రోస్కోపులు ఇక్కడ భద్రపరచారు. ముక్తేశ్వర్‌లోని IVRI ప్రాంగణంలో ఉన్న జీరో పాయింట్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడి నుండి హిమాలయ పర్వత శ్రేణులైన నందా దేవి, త్రిశూల్, పంచాచులి శిఖరాలను అత్యంత స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి పచ్చని అడవుల గుండా నడవాల్సి ఉంటుంది.

ముక్తేశ్వర్‌కు ఎలా చేరుకోవాలి..?

ముక్తేశ్వర్‌కు నేరుగా రైల్వే స్టేషన్ లేదు. ముక్తేశ్వర్ దగ్గరలో కత్‌గోడం రైల్వే స్టేషన్ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో ఇక్కడి వరకు చేరుకుని…ట్యాక్సీలు, బస్సుల్లో ముక్తేశ్వర్ వెళ్లొచ్చు. ముక్తేశ్వర్
దగ్గరి విమానాశ్రయం..పంత్‌నగర్ విమానాశ్రయం. ఇక్కడి నుంచి ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుంచి ముక్తేశ్వర్ 350 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి హల్ద్వానీ లేదా కత్‌గోడం వరకు వచ్చి..అక్కడి నుంచి ముక్తేశ్వర్‌కు చేరుకోవచ్చు.

Also Read: ఈ వేసవికి బెస్ట్ డెస్టినేషన్.. ఉత్తరాఖండ్‌లోని ‘బిన్సార్’ పూర్తి టూర్ ప్లాన్!

Story by: Kanugula Kishan, Big Tv

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×