అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదాన్ని అప్పుడే ఎవరూ మర్చిపోలేరు. దాదాపు 300 మంది ఆ ఘటనలో మరణించారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 కుటుంబాలకు ఆ విమాన ప్రమాదం శోకాన్నే మిగిల్చింది. టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లోనే ఖాళీ బూడిదయింది అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం. అయితే 1980లో ఇలాంటి సంఘటన జరిగింది. కానీ అందులో విమానం చాలా సురక్షితంగా ల్యాండ్ అయింది. అయినా కూడా విమానంలో ఉన్న 301 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరిచిపోలేని విమానం ప్రమాదం
1980లో సౌదీ ఫ్లైట్ 163 రియాద్ నుండి జెడ్డాకు వెళుతోంది. ఈ విమానంలో 287 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే 14 మంది సిబ్బంది కూడా ఉన్నారు. టేకాఫ్ అయిన ఏడు నిమిషాలకే సిబ్బందికి ఒక హెచ్చరిక తెలిసింది. ఆ సమయంలో విమానం దాదాపు భూమి నుండి 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. కార్గో డిపార్ట్మెంట్ నుండి పొగ వస్తున్నట్టు పైలెట్లకు సమాచారం అందించారు. విమానం తోక దగ్గర ఏర్పాటు చేసిన స్మోక్ డిటెక్టర్ నుండి కూడా పొగ వస్తున్నట్టు చెప్పారు. అలా ఎందుకు వస్తుందో ఇంజనీర్ కానీ, పైలెట్ కానీ సరిగా అంచనా వేయలేకపోయారు. దాదాపు నాలుగు నిమిషాలు సమయాన్ని వృధా చేశారు. ఆ తర్వాత క్యాబిన్ వెనుక పొగ విపరీతంగా పెరిగిపోయింది. ఈలోపే మంటలు చెలరేగడం మొదలయ్యాయి.
చేసిన తప్పు ఇదే
మంటలు విమానం వెనుక భాగంలో మొదలయ్యాయి. కాబట్టి అది తీవ్రమైన సమస్య కాదని పైలెట్ భావించారు. విమానాన్ని రియాద్ కే తిరిగి వచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అలా ల్యాండ్ చేసిన వెంటనే పైలెట్ ప్రయాణికులందరినీ వెంటనే విమానం దింపి బయటికి తీసుకొచ్చేయాలని. కానీ పైలెట్ విమానాన్ని పూర్తిగా ఆపలేదు. ఇంజిన్ ను అలా ఆన్ లోనే ఉంచారు. విమానం ల్యాండ్ అయిన మూడు నిమిషాల 15 సెకన్ల తర్వాత పైలెట్ ఇంజన్ ను స్విచ్ ఆఫ్ చేశారు.
ఇలా మరణించారు
ఈ లోపే విమానం వెనుక భాగం నుంచి పొగలు కమ్మేసాయి. ఇంజన్ ఆగిపోయిన దాదాపు 23 నిమిషాల తర్వాత గ్రౌండ్ సిబ్బంది తలుపులు తెరిచారు. ఈలోపు విమానం మంటల్లో చిక్కుకుంది. పొగ నిండుగా కమ్మేసింది. మూడు వందల ఒక్క మంది అలా రన్ వే పైనే విమానంలోనే ఊపిరాడక మరణించారు. తలుపు తెరవడానికి ముందే అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రయాణికులు అందరినీ కిందకు దించేసి ఉంటే అందరి ప్రాణాలు దక్కేవి. కానీ అలా చేయకుండా సమయాన్ని వృధా చేయడం వల్ల 301 ప్రాణాలు అన్యాయంగా గాలిలో కలిసిపోయాయి.