అక్టోబర్ నెలలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ అక్టోబర్ లోనే వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయినా, ఎందుకు ప్రారంభించలేదనే విషయంపై తాజాగా రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ అత్యాధునిక రైళ్లలో ఫర్నిషింగ్ సమస్యలను గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
రైల్వే బోర్డు ఇటీవల డైరెక్టర్ జనరల్, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO), అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు పంపిన లిఖితపూర్వక కమ్యూనికేషన్ లో వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఫర్నిషింగ్ సమస్యల గురించి ప్రస్తావించింది. “చాలా చోట్ల ఫర్నిషింగ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. బెర్తింగ్ ప్రాంతంలో పదునైన అంచులు, కమర్లు, విండో కర్టెన్ హ్యాండిల్స్, బెర్త్ కనెక్టర్ల మధ్య పిజియన్ పాకెట్స్ క్లీనింగ్ సమస్యలను కలిగి ఉన్నాయి”. ప్రస్తుత రేక్ లో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బోర్డు వెల్లడించింది. భవిష్యత్ రేక్ లకు అవసరమైన డిజైన్ లో అప్ డేట్ అవసరం అన్నది.
16 కోచ్ ల వందే భారత్ స్లీపర్ రేక్ నిర్వహణకు రైల్వే బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ, రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చే ముందు కొన్ని లోపాలను సరిదిద్దాలని సూచించింది. ఫైర్ సేఫ్టీ, కవచ్ 4.0 ఏర్పాటు, లోకో పైలట్, రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్ మధ్య సరైన కమ్యూనికేషన్, బ్రేకింగ్ వ్యవస్థల నిర్వహణ లాంటి భద్రతా ప్రోటోకాల్స్ లో మరింత కచ్చితత్వం అవసరమని వెల్లడించింది. శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బంది వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణించే మార్గంలో అందుబాటులో ఉండేలా జోన్లు చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో సెమీ పర్మనెంట్ కప్లర్ ను 15 నిమిషాల్లోపు అన్ కప్లింగ్ చేయగలగాలి సూచించింది. ట్రయల్స్ తర్వాత RDSO చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి తుది ఆమోదం పొందిన తర్వాత, ఆపరేషనల్ అనుమతి కోసం మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అటు వందే భారత్ స్లీపర్ రైళ్ల రూట్స్ ఇంకా ఖరారు కాలేదు.
వందే భారత్ స్లీపర్ రైళ్లు అత్యంత వేగం, అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది. సుదూర రాత్రి ప్రయాణాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. హై స్పీడ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైలుగా రూపొందించారు. దీని ఆపరేషనల్ వేగం 160 కి.మీగా రైల్వే బోర్డు నిర్ధారించింది. గరిష్ట వేగం 180 కి.మీ. ప్రీమియం ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, వాటర్ బాటిల్ హోల్డర్లు, రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. సొగసైన డిజైన్, ప్రీమియం సౌకర్యం, ప్రపంచ స్థాయి ఫీచర్లు ఉన్నాయి. భారతీయ రైలు ప్రయాణీకులకు వందేభారత్ స్లీపర్ సరికొత్త ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.
Read Also: ఏనుగులకు దారి ఇచ్చేందుకు.. 13 రైళ్లు నిలిపేసిన రైల్వే అధికారులు!