భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల కాలంలో వందే భారత్ తో సరికొత్త ఒరవడి మొదలైందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ లు భారత్ రైల్వే గతినే మార్చేయబోతున్నాయి. ఈ క్రమంలో వీలైనంత వరకు పాతపద్ధతుల్ని మార్చుకునేలా, పాత విధానాలకు స్వస్తి పలికేలా రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో ఒకటి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) రూపొందించిన కోచ్‌లను ఉపసంహరించుకోవడం. వీటిపై ఇప్పటికే పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందడంతో వీటిని ఉపసంహరించుకోడానికి రైల్వే సిద్ధపడింది. ఈమేరకు రైల్వే బోర్డు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ICF కోచ్ అంటే ఏంటి..?
బులుగు రంగులో ఉండేవి ICF కోచ్ లు. ఇవి తమిళనాడులోని పెరంబూర్ లో ఉన్న ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతాయి. వీటి డిజైన్లను స్విట్జర్లాండ్ నుంచి ఇండియన్ రైల్వే తీసుకుంది. 1955లో మొట్టమొదటి కోచ్ ని తయారు చేశారు. వీటిని మైల్డ్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేస్తారు. వీటి బరువు ఎక్కువ. ఒక కోచ్ ని ఇంకో కోచ్ తో లింక్ చేయడానికి స్క్రూ కప్లింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు. ప్రతి 18 నెలలకు ఒకసారి ఈ కోచ్ లలోని పార్ట్ లు అన్నిట్నీ విడదీసి అసెంబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో సైడ్ బఫర్స్ ఉంటాయి. ఇవి షాక్ అబ్జార్బర్స్ లా పనిచేస్తాయి. వీటి గరిష్ట వేగం 110 నుంచి 120 కిలోమీటర్లు మాత్రమే. అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్లడానికి ఈ కోచ్ లను ఉపయోగించకూడదు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే, ఒక కోచ్ పైకి ఇంకో కోచ్ ఎక్కుతుంది. అందువల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. వివిధ కారణాల వల్ల వీటి తయారీని 2018లోనే ఆపేశారు. అయితే ఇవి ఇంకా వినియోగంలోనే ఉన్నాయి. పాతవాటినే ఇంకా ఉపయోగిస్తున్నారు.
LHB కోచ్ లు..
ICF కోచ్ లను LHB కోచ్ లతో భర్తీ చేయడానికి రైల్వే నిర్ణయం తీసుకుంది. లింక్ హాఫ్ మెన్ బుష్ కోచ్ లను LHB కోచ్ లు అంటారు. ఈ టెక్నాలజీని మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. భారత్ లో 2002 నుంచి ఈ కోచ్ లను తయారు చేస్తున్నారు. ముంబై నుంచి న్యూఢిల్లీ మధ్య నడిపే రాజధాని ఎక్స్ ప్రెస్ లో తొలిసారిగా LHB కోచ్ లను వాడారు. అయితే వీటి తయారీ ఖర్చు బాగా ఎక్కువ. ఒక్కో కోచ్ తయారు చేయడానికి కోటిన్నర నుంచి 2కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అందువల్ల ఒకేసారి కాకుండా విడతల వారీగా ICF కోచ్ ల స్థానంలో LHB కోచ్ లను మారుస్తున్నారు. వీటికి బయటి వైపు స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ ఉంటుంది. ఇంటీరియర్ అల్యూమినియంతో తయారు చేస్తారు. వీటి బరువు తక్కువ. ఇంటీరియర్ మాడ్యులర్ గా ఉంటుంది. కిటికీలు పెద్దవిగా ఉంటాయి. ఈ కోచ్ ల గరిష్ట వేగం 200 కిలోమీటర్లు. ప్రస్తుతం 160 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్లే ట్రైన్లకు వీటిని అమరుస్తున్నారు. వీటిని సెంటర్ బఫర్ కప్లింగ్ ద్వారా అనుసంధానిస్తారు.
ICF కోచ్ లతో పోల్చి చూస్తే LHB కోచ్ లు అధునాతనమైనవి. ప్రమాదాల సమయంలో కూడా వీటి వల్ల ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ. ట్రైన్ లోపల సౌకర్యాల విషయానికొస్తే ICF కోచ్ లతో పోల్చి చూస్తే LHB కోచ్ లనే ప్రయాణికులు ఎక్కువగా ఇష్టపడతారు. పాత కోచ్ ల వల్ల అసౌకర్యాలకు గురవుతున్నామంటూ ఇటీవల చాలామంది ప్రయాణికులు రైల్వేకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే కోచ్ ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. దక్షిణ రైల్వేలో మాత్రమే ప్రస్తుతం వీటిని ఉపయోగిస్తున్నారు. 154 రేక్‌లు ప్రస్తుతం అనేక మార్గాల్లో ప్రయాణీకుల సేవలో ఉన్నాయి. వీటిని 2028 నాటికి పూర్తిగా నిలిపివేయాలని ఆలోచిస్తున్నారు అధికారులు. వీటి స్థానంలో LHB కోచ్ లు తీసుకుని వస్తారు. ప్రస్తుతం ఈ కోచ్ లను భారత్ లో మూడు ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ మార్పు జరిగితే పాతతరం కోచ్ లను మనం ఇక చూడలేమన్నమాట.