Wedding Invitation Fraud: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ తమ పనితీరును మారుస్తూ, కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొడుతున్నారు. ఇంటర్నెట్ వాడకం పెరిగిన కొద్దీ, ఆన్‌లైన్ మోసాలు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త స్కామ్‌లు తెరపైకి వస్తుండటంతో, ప్రజలు జాగ్రత్తగా లేకుంటే క్షణాల్లో లక్షలు, కోట్లు కోల్పోయే పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వేదికగా చేసుకుని ఈ కేటుగాళ్లు సులభంగా ప్రజలను ఉరేసుకుంటున్నారు.
పెళ్లి ఆహ్వానాలు, బహుమతి లక్కీ డ్రాలు, బ్యాంక్ అప్డేట్ లింకులు వంటి ఆకర్షణీయమైన ఎత్తుగడలతో అమాయకులను నమ్మించి.. చివరికి వారి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. తాజాగా, మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్‌లో వచ్చిన పెళ్లి ఆహ్వానం పేరిట లక్షలు నష్టపోయాడు. సైబర్ మోసగాళ్లు పంపిన ఓ ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేయగానే అతని బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యింది. దీంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
Also Read: ATM transaction: ఆర్‌బీఐ కొత్త ఏటీఎం నియమాలు.. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే బాదుడే..
స్కాం ఎలా చేశారు..
మహారాష్ట్ర హింగోలీకి చెందిన ఆ ఉద్యోగికి ఆగస్ట్ 30న పెళ్లి ఉందంటూ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ‘‘వెల్‌కమ్.. షాదీ మే జరూర్ ఆయే’’ అని రాసి ఉండగా, దానికి జతగా పీడీఎఫ్‌లా కనిపించే ఒక ఫైల్‌ను పంపించారు. కానీ అది అసలు పెళ్లి కార్డు కాదు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే). దాన్ని ఓపెన్ చేయగానే అతడి మొబైల్‌లోని అన్ని డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. వెంటనే అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.90 లక్షలు మాయం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆ ఉద్యోగి హింగోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,
ఈ స్కామ్ గతేడాది నుంచి వెలుగులోకి
ఈ వాట్సాప్ వెడ్డింగ్ స్కామ్ గతేడాది నుంచి వెలుగులోకి వచ్చింది, ఇప్పటికే చాలా మంది బాధితులైనట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా నేరగాళ్లు గుర్తు తెలియని నంబర్ల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా పెళ్లి కార్డులు, వీడియోలు, ఏపీకే ఫైళ్లు పంపుతారు. అవి ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌లో అనవసర యాప్ డౌన్‌లోడ్ అయ్యి, డేటా మొత్తం హ్యాకర్ల చేతికి చేరుతుంది. అందువల్ల పరిచయం లేని నంబర్ల నుంచి వచ్చే పెళ్లి ఆహ్వానాలు, లింకులు, డాక్యుమెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.