Multani Mitti Face Pack: ముల్తానీ మిట్టిలో సహజసిద్ధమైన శోషణ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం నుండి అదనపు నూనె, మురికి, మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. ముఖంపై ట్యాన్ అనేది చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు,మెలనిన్ (melanin) ఉత్పత్తి పెరగడం వల్ల వస్తుంది. ముల్తానీ మట్టి ఈ మృత కణాలను తొలగించి.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీనిలోని సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం యొక్క రంగును మెరుగుపరిచి.. ట్యాన్‌ను తగ్గిస్తాయి. అంతే కాకుండా ఇది సూర్యరశ్మి వల్ల కలిగే మంట, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.
టాన్ తొలగిపోవడానికి ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్‌లు:
ముల్తానీ మట్టిని వివిధ పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్‌లుగా ఉపయోగించడం ద్వారా టాన్‌ను పూర్తిగా తొలగించుకోవచ్చు.
1.ముల్తానీ మట్టి , రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్:
తయారీ: ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకొని, తగినంత రోజ్ వాటర్ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారు చేయాలి.
వాడే విధానం: ఈ పేస్ట్‌ను ముఖం, మెడ, ట్యాన్ ఉన్న శరీర భాగాలకు సమానంగా అప్లై చేయాలి. 15-20 నిమిషాలు ఆరనిచ్చి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంపై ట్యాన్ ను పూర్తిగా తొలగిస్తుంది.
ప్రయోజనం: రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా మారుస్తుంది. అంతే కాకుండా ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్ ను తగ్గించి, చర్మానికి సహజసిద్ధమైన నిగారింపును ఇస్తుంది. వారానికి 2-3 సార్లు కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చు.
2.ముల్తానీ మట్టి, టమాటో జ్యూస్, గంధం పొడితో ప్యాక్:
తయారీ: 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టికి, 1 టేబుల్ స్పూన్ టమాటో రసం, అర టీస్పూన్ గంధం పొడి, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి.
వాడే విధానం: ఈ ప్యాక్‌ను ముఖానికి.. ట్యాన్ ఉన్న భాగాల్లో అప్లై చేసి.. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనం: టమాటోలో లైకోపీన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది టాన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గంధం చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా పసుపు చర్మానికి మెరుపునిస్తుంది.
3.ముల్తానీ మట్టి, కలబంద జెల్‌తో ప్యాక్:
తయారీ: 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన కలబంద జెల్ కలిపి పేస్ట్‌లా చేయాలి.
వాడే విధానం: దీనిని టాన్ ఉన్న ప్రాంతాలపై అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనం: కలబందలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇవి సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేస్తాయి.
Also Read: టమాటో ఫేస్ ప్యాక్‌తో.. 10 నిమిషాల్లోనే నిగనిగలాడే చర్మం
ముల్తానీ మట్టి సహజమైనప్పటికీ.. పొడి చర్మం ఉన్నవారు పాలు, తేనె లేదా పెరుగు వంటి తేమను అందించే పదార్థాలను కలిపి వాడటం మంచిది. ఇది చర్మాన్ని పొడిగా మార్చకుండా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ముఖంపై టాన్‌ను తగ్గించుకోవడమే కాకుండా, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా కొత్త మెరుపును పొందవచ్చు.