Diwali 2025: అక్టోబర్ లో దీపావళి, ఛత్ పూజ లాంటి పెద్ద పండుగలు రాబోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. లక్షలాది మంది ప్రయాణీకులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. పండుగ రద్దీ నేపథ్యంలో కన్ఫార్మ్ రైలు టికెట్లను పొందడం చాలా కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు సహాయం చేయడానికి, భారతీయ రైల్వే బుకింగ్ నియమాలను సవరించింది. అంతేకాదు, కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశాలను మెరుగుపరిచే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను సూచించింది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
60 రోజుల ముందస్తు బుకింగ్ నియమం
భారతీయ రైల్వే ముందస్తు బుకింగ్ గడువును గతంలో 120 రోజులు ఉండగా, రీసెంట్ గా దానిని 60 రోజులకు కుదించింది. అంటే ప్రయాణీకులు తమ ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు మాత్రమే టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీపావళికి అక్టోబర్ 20న ప్రయాణించాలనుకుంటే, ఆగస్టు 20 నుండే బుకింగ్ ప్రారంభించబడుతుంది. అదేవిధంగా, రైలు ఒక రోజు తరువాత బయలుదేరితే, టిక్కెట్లను 61 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ఇబ్బంది లేని బుకింగ్ కోసం టిప్స్
దీపావళి పండుగ సందర్భంగా టికెట్ విండో తెరిచిన నిమిషాల్లోనే టికెట్లు అయిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి.
⦿ బుకింగ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు IRCTC వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి.
⦿ ప్రయాణానికి సరిగ్గా రెండు నెలల ముందు అంటే, విండో తెరిచిన తొలి రోజున టికెట్లను బుక్ చేసుకోవాలి.
⦿ ఇక మీరు వెళ్లే మార్గంలోని ఇతర రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్లను సూచించే ప్రత్యామ్నాయ రైళ్ల ఎంపికను ఉపయోగించుకోవాలి.
⦿ త్వరగా పేమెంట్స్ చేయడానికి, చెల్లింపు ఆలస్యాన్ని నివారించడానికి IRCTC వాలెట్ లో తగినంత బ్యాలెన్స్ ను మెయింటెయిన్ చేయడం మంచిది.
కన్ఫార్మ్ టికెట్ దొరకకపోతే బ్రేక్ జర్నీని ట్రై చేయండి!
ఒకవేళ మీ బోర్డింగ్ స్టేషన్ నుంచి మీ గమ్యస్థానానికి నేరుగా ధృవీకరించబడిన రైలు టికెట్ దొరక్కపోతే, బ్రేక్ జర్నీని ఎంచుకోవడం బెస్ట్. ఒకవేళ మీరు ఢిల్లీ నుంచి కతిహార్ కు ప్రయాణిస్తుంటే, నేరుగా టికెట్లు అందుబాటులో లేకపోతే, లక్నో లేదంటే వారణాసి లాంటి ఇంటర్మీడియట్ స్టేషన్ కు టికెట్ బుక్ చేసుకోవాలి. అక్కడి నుంచి మరొక రైలు ద్వారా మీ గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్దతి ద్వారా కొంచెం అలసిపోయినప్పటికీ, పండగ రద్దీ వేళ ఇంటికి చేరుకోవడానికి తప్పదు. ముఖ్యంగా రద్దీగా ఉండే పండుగ సీజన్లలో ఈ విధానం ఉపయోకరంగా ఉంటుంది.
అక్టోబర్ 20న దీపావళి
ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20న జరగనుంది. ఆ తర్వాత ఛత్ పూజ అక్టోబర్ 25న ప్రారంభమవుతుంది. ఈ పండుగలలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా పరిసర రాష్ట్రాల వైపు పెద్ద మొత్తంలో రాకపోకలు జరుగుతాయి. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పటికీ, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
Read Also: వినాయక చవితి ప్రత్యేకం.. అందుబాటులోకి 380 ప్రత్యేక రైళ్లు!