India’s 350 kmph Bullet Train B35: ఇండియన్ హైస్పీడ్ రైలు ప్రయాణంలో మరో కీలక అడుగు పడుతోంది. ప్రస్తుతం జపాన్ సహకారంతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కొనసాగుతుండగా.. భవిష్యత్తులో దేశీయంగా హైస్పీడ్ రైళ్లను తయారు చేయాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల డిజైన్ వేగంతో నడిచే B35 హైస్పీడ్ రైలు తయారు చేయాలని భావిస్తోంది.
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. 2015లో సుమారు రూ.1.1 లక్షల కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.2 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇందులో దాదాపు రూ.1 లక్ష కోట్లను ప్రభుత్వ బడ్జెట్ ద్వారా సమకూర్చే అవకాశం ఉంది. భూసేకరణ, నిర్మాణ పనులు, రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల ఖర్చులు పెరగడంతో ఖర్చు అమాంతం రెట్టింపు అయ్యింది. ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో ప్రారంభ దశలో B28 హైస్పీడ్ రైళ్లను నడపనున్నారు. వీటి డిజైన్ వేగం గంటకు 280 కిలోమీటర్లు కాగా, గరిష్టంగా గంటకు 249 కిలోమీటర్ల వేగంతో నడిపేలా రూపొందిస్తున్నారు. ఈ రైళ్లను BEML తయారు చేయనుంది. మొత్తం 32 B28 రైళ్లను తయారు నిర్మించనుంది. 2027లో రెండు ప్రోటోటైప్ రైళ్లు పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. మరో 15 రైళ్ల తయారీ కోసం రూ.5,400 కోట్ల విలువైన అదనపు కాంట్రాక్ట్ కూడా లభించినట్లు BEML వెల్లడించింది.
B28 తర్వాత భారత్ మరింత అధునాతనమైన B35 హైస్పీడ్ రైలును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని డిజైన్ వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఈ రైలు అందుబాటులోకి వస్తే దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ రైలు టెక్నాలజీలో భారత్ మరో స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. 2030 నాటికి B35 అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే సమయంలో జపాన్ కూడా నెక్ట్స్ జెనరేషన్ E10 హైస్పీడ్ రైళ్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. జపాన్ E10 రైళ్లు 2034 నాటికి కార్యకలాపాలకు సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వాటి పనితీరును పరిశీలించిన తర్వాత భారత్ తన తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
హైస్పీడ్ రైళ్లతో పాటు రైలు భద్రత, స్పీడ్ కంట్రోల్ కోసం స్వదేశీ భారత్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (BTCS)ను కూడా అభివృద్ధి చేయనుంది. రైళ్ల వేగం, వాటి మధ్య సురక్షిత దూరం, ఇతర కీలక భద్రతా అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షించనుంది.
మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను డిసెంబర్ 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం B28 రైళ్లతో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం.. భవిష్యత్తులో B35 లాంటి వేగవంతమైన స్వదేశీ రైళ్లకు మార్గం సుగమం చేయనుంది.
Read Also: 20 గంటల ప్రయాణం ఇక 7 గంటలే.. మరో బుల్లెట్ రైలు కారిడార్ కు గ్రీన్ సిగ్నల్!