Anasuya: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj) మహిళల హక్కులు, స్వయం ప్రతిపత్తి , సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందిస్తూనే ఉంటారు. తాజాగా మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ అలాగే నెగిటివ్ ట్రోలింగ్‌పై ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తప్పు ఇద్దరిదీ ఉన్నా.. లేదా మార్పు ఇద్దరిలో వచ్చినా.. కేవలం మహిళలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ప్రశ్నిస్తూ.. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది..
సాధారణంగా ఇలాంటి విషయాలపై స్పందించనప్పటికీ, ఇటీవల బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం బరువు పెరిగారని జరిగిన ట్రోలింగ్ తనను తీవ్రంగా కలిచివేసిందని అనసూయ తెలిపారు. గతంలో అనుష్క శర్మ, దీపికా పదుకొణే వంటి అనేకమంది నటీమణులు కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్లను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. మహిళా సెలబ్రిటీలను నిరంతరం విమర్శించడం లేదా వారిని ఒక నిర్దిష్ట ప్రమాణంతో కొలవడం నిజంగా విసుగు తెప్పిస్తోందని మండిపడ్డారు.
సమాజం మహిళల నుండి స్పెషల్ స్టాండర్డ్స్ ఆశిస్తోందని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. “మహిళా సెలబ్రిటీలు ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలి, ప్రసవం తర్వాత పరిపూర్ణమైన శరీర ఆకృతిని కలిగి ఉండాలి, కుటుంబం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఒకవేళ వారు ఆ అసాధ్యమైన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే ట్రోలింగ్ మొదలుపెడతారు. ఇది అత్యంత దారుణం” అని అనసూయ పేర్కొన్నారు.
“ప్రతి సెలబ్రిటీ వెనుక ఒక సాధారణ మహిళ ఉంది. ఎంత సెలబ్రిటీ అయినా సరే మహిళ కదా.. సాధారణంగా ప్రతి మహిళలో.. వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజం, ప్రసవాంతరం మార్పులు సహజం, ఒత్తిడి కారణంగా, అనారోగ్య సమస్యలతో నిత్యం సతమతమవుతూ ఉంటుంది.. అంతేకాదు తన కుటుంబం కోసం నిర్ణయాలు తీసుకునే ఒక మహిళ.. మనందరిలాగే నిరంతరం విమర్శలకు గురికాకుండా ప్రశాంతంగా జీవించే అర్హత ఆ మహిళకు కూడా ఉండాలి కదా.. ఇక మహిళలు ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు, మనుషులుగా ఉన్నందుకు వారిని నిందించడం మానుకోవాలి” అని హితవు పలికారు.
also read:ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!
సినిమాల్లో లేదా జీవితంలో పెళ్లి తర్వాత మగవారు, ఆడవారు ఇద్దరూ బోల్డ్ సీన్స్‌లో నటించినా లేదా నిర్ణయాలు తీసుకున్నా కేవలం ఆడవారిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారని అనసూయ నిలదీశారు. తప్పు లేదా మార్పు ఇద్దరిలో ఉన్నప్పటికీ, నెగిటివ్ ట్రోలింగ్ మాత్రం కేవలం మహిళలపైనే చేయడం ఏమాత్రం తగదని, సమాజం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని స్పష్టం చేశారు.
అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్లను, ముఖ్యంగా మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సెలబ్రిటీ అయినా, సాధారణ మహిళ అయినా వారి శరీరం మరియు నిర్ణయాలపై అనవసరమైన కామెంట్లు చేయడం ఆపాలని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఈ ఘాటు పోస్ట్ మరోసారి స్పష్టం చేసింది..