Train Coach Limit Explained: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. సాధారణ రోజుల్లోనే కొన్ని రైళ్లు కిక్కిరిసిపోతుంటే.. పండగలు, సెలవుల సమయంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. బోగీల్లో సీట్లు దొరకకపోవడం, తలుపుల దగ్గర నిల్చోవడం, కొన్ని సందర్భాల్లో వేలాడుతూ ప్రయాణించడం కనిపిస్తుంటుంది. అయితే, బలమైన రైలు ఇంజిన్లు ఉన్నప్పుడు మరికొన్ని బోగీలను యాడ్ చేసి, ప్రయాణికుల రద్దీని ఎందుకు తగ్గించకూడదు? అసలు ఒక ఇంజిన్ ఎంత బరువును లాగగలదు? రైలు పొడవును పెంచడంలో ఉన్న సమస్యలేంటి? అనే డౌట్ వస్తుంది.
భారతీయ రైల్వేల్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లలో WAP-7, WAG-12 లాంటి పవర్ ఫుల్ ఇంజిన్లు ఉన్నాయి. WAP-7 సుమారు 6,000 హార్స్ పవర్ సామర్థ్యంతో ఉండగా, WAG-12 సుమారు 12,000 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ప్రయాణికుల రైళ్లను దాదాపు 24 నుంచి 28 బోగీలతో నడపడం సాధ్యమే. సరుకు రవాణాలో బరువు మరింత ఎక్కువగా ఉంటుంది. అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ ఇంజిన్లను ఉపయోగించి భారీ రైళ్లను కూడా నడుపుతున్నారు. అంటే సమస్య ఇంజిన్ బలం ఒక్కటే కాదు. రైలు ఎంత పొడవుగా ఉండాలన్నది మొత్తం రైల్వే వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
బోగీల సంఖ్య పెంచాలంటే ముందుగా స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్‌ల పొడవును పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి స్టేషన్‌లో పొడవైన రైలుకు సరిపోయే ప్లాట్‌ఫారమ్ ఉండదు. 30 లేదంటే 35 బోగీల రైలును నడిపితే కొన్ని బోగీలు ప్లాట్‌ఫారమ్ బయట ఆగే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రయాణికులు ఎక్కడం, దిగడం ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న స్టేషన్లలో భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
అటు ప్లాట్ ఫారమ్ ను పొడిగించడం కూడా అంత సులభమైన పని కాదు. స్టేషన్‌కు అనుసంధానంగా ఉండే ట్రాక్‌లు, పాయింట్లు, యార్డులు కూడా అందుకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. నగర ప్రాంతాల్లో భూమి కొరత కారణంగా ఇలాంటి విస్తరణలు మరింత కష్టతరంగా మారతాయి. అదే సమయంలో రైళ్లను పక్కకు ఆపి మరో రైలుకు మార్గం ఇవ్వడానికి ఉపయోగించే లూప్ లైన్ల పొడవు కూడా చాలా కీలకం. రైలు పొడవు లూప్ లైన్ కంటే ఎక్కువైతే దాన్ని పూర్తిగా పక్కకు తీసుకోవడం కుదరకపోవచ్చు. దీంతో మొత్తం రైలు రాకపోకలపై ప్రభావం పడుతుంది.
రైలు పొడవు పెరిగేకొద్దీ స్టేషన్‌లోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది. రైల్వే గేట్లు ఎక్కువసేపు మూసి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒకే మార్గంలో వరుసగా ఎక్కువ రైళ్లను నడపడం కూడా కష్టమవుతుంది. అందుకే ప్రయాణికుల రద్దీకి పరిష్కారం కేవలం మరిన్ని బోగీలు జోడించడమే కాదు. కొన్ని మార్గాల్లో అధిక సామర్థ్యం ఉన్న రైళ్లు, పుష్ పుల్ టెక్నాలజీ, డబుల్ డెక్కర్ లాంటి విధానాలు కూడా ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. సో, రైలు ఇంజిన్‌కు ఉన్న శక్తి మాత్రమే బోగీల సంఖ్యను నిర్ణయించదు. ప్లాట్‌ఫారమ్ పొడవు నుంచి ట్రాక్ సామర్థ్యం, సిగ్నలింగ్, స్టేషన్ యార్డులు, రైళ్ల రాకపోకల వరకు అనేక అంశాలు కలిసి ఒక రైలు ఎంత పొడవుగా ఉండాలో నిర్ణయిస్తాయి.
Read Also: పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!