Delhi-Varanasi Sleeper Vande Bharat: భారతీయ రైల్వే హైస్పీడ్ ప్రయాణాల దిశగా కీలక అడుగులు వేస్తోంది. దేశంలో హైస్పీడ్ రైలు నెట్ వర్క్ ను విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఢిల్లీ–సిలిగురి మధ్య బుల్లెట్ రైలు కారిడార్ ను అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రస్తుతం 20 నుంచి 24 గంటల వరకు పడుతున్న ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి సిలిగురికి కేవలం 6 గంటల 45 నిమిషాల్లో చేరుకునే అవకాశం కలగనుంది.
ప్రతిపాదిత ఢిల్లీ–వారణాసి–పాట్నా–సిలిగురి హైస్పీడ్ రైలు మార్గం సుమారు 865 కిలోమీటర్ల మేర నిర్మించాలనే ప్రణాళిక ఉంది. ఈ కారిడార్ ద్వారా ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు కీలక నగరాలకు వేగవంతమైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక(DPR)ను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రతిపాదన ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది.
ప్రస్తుతం ఢిల్లీ నుంచి సిలిగురికి రైలులో ప్రయాణించడానికి సుమారు 20 నుంచి 24 గంటలు పడుతోంది. ప్రతిపాదిత హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 6 గంటల 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా ఢిల్లీ–పాట్నా ప్రయాణం సుమారు 4 గంటల 41 నిమిషాలు, ఢిల్లీ–వారణాసి ప్రయాణం 3 గంటల 50 నిమిషాలు పట్టేలా ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. వారణాసి నుంచి సిలిగురికి సుమారు 2 గంటల 55 నిమిషాలు, పాట్నా నుంచి సిలిగురికి దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే ఉత్తర, తూర్పు భారతదేశాల మధ్య ప్రయాణం మరింత వేగంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, పర్యాటకం కోసం ఈ నగరాల మధ్య తరచూ ప్రయాణించే వారికి సమయం ఆదా కానుంది. వారణాసి, పాట్నా, సిలిగురి వంటి నగరాలను ఒకే హైస్పీడ్ నెట్ వర్క్ తో అనుసంధానించడం వల్ల ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
ఢిల్లీ–సిలిగురి కారిడార్ ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైలు వ్యవస్థను విస్తరించేందుకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర ఏడు కారిడార్లను గుర్తించారు. వీటిలో ఢిల్లీ–వారణాసి, వారణాసి–పాట్నా–సిలిగురి, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్, చెన్నై–హైదరాబాద్, ముంబై–పుణే, పుణే–హైదరాబాద్ మార్గాలు ఉన్నాయి.
దేశంలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ గా చేపట్టిన ముంబై–అహ్మదాబాద్ కారిడార్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాలు అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Read Also: తెలంగాణకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్ వచ్చేస్తోంది!