Festival Special Trains 2026: దసరా, దీపావళి, ఛత్ లాంటి పండుగలు దగ్గరపడుతున్న వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రైళ్లలో టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ టైమ్ లో ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 1,000కు పైగా ప్రత్యేక రైలు ట్రిప్పులను ప్రకటించింది.
ఉత్తర మధ్య రైల్వే.. సెప్టెంబర్ 19, 2026 నాటికి మొత్తం 1,053 ట్రెయిన్స్ ఆన్ డిమాండ్ ట్రిప్పులను ఖరారు చేసింది. ఈ ప్రత్యేక సర్వీసులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. అంటే, పండుగ సీజన్‌లో దాదాపు 61 రోజుల పాటు ప్రయాణికులకు అదనపు రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సాధారణ రైళ్లలో కన్ఫర్మ్డ్ టికెట్లు దొరకని వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ ప్రత్యేక రైళ్లను ఒకే విధమైన షెడ్యూల్ తో కాకుండా ప్రయాణికుల అవసరాన్ని బట్టి పలు రకాల ఫ్రీక్వెన్సీలలో నడపనున్నారు. కొన్ని సర్వీసులు పండుగ కాలంలో ఒక్కసారి మాత్రమే నడిచే అవకాశం ఉండగా, మరికొన్ని వారానికి ఒకటి, రెండు సార్లు అందుబాటులో ఉంటాయి. ఉత్తర మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్, టికెట్ బుకింగ్ స్టేటస్, వెయిటింగ్ లిస్టులను నిరంతరం పరిశీలిస్తున్నారు. అవసరం పెరిగితే ప్రత్యేక రైళ్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం కూడా ఉంది.
ఈ ప్రత్యేక రైళ్లు దేశంలోని పలు ముఖ్యమైన నగరాలు, రైల్వే స్టేషన్లను కలుపుతూ నడవనున్నాయి. కోల్ కతా, ప్రయాగ్ రాజ్, కాన్పూర్ సెంట్రల్, న్యూఢిల్లీ, పల్వాల్, ఆనంద్ విహార్ టెర్మినల్, హజ్రత్ నిజాముద్దీన్, గ్వాలియర్, ఝాన్సీ, ఆగ్రా కంటోన్మెంట్ లాంటి ప్రాంతాలకు అదనపు కనెక్టివిటీ లభించనుంది. అలాగే దాద్రి, పుణే, హడప్సర్, ఖజురహో, తిరుచానూర్ తదితర ప్రాంతాలను కలిపే ప్రత్యేక సర్వీసులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలు సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
పండుగ సమయంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉత్తర మధ్య రైల్వే స్టేషన్లలో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు కమర్షియల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!