IRCTC Ooty Tour Package from Hyderabad: హిల్ స్టేషన్లలో విహరించాలనుకునే హైదరాబాదీయులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో ఊటీతో పాటు కూనూర్‌ను కూడా సందర్శించే అవకాశం ఉంది. రైలు ప్రయాణం, హోటల్ వసతి, లోకల్ లో ఏసీ వెహికల్ ప్రయాణం ఇందులో ఉంటాయి. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ ట్రిప్ కొనసాగుతుంది.
ఈ టూర్ ప్రతి మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం 2:25 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (20629)లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయం 9:10 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ఏసీ వాహనంలో తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ తర్వాత బోటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.
మూడో రోజు దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని చూపిస్తారు. అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకుని అక్కడే రాత్రి బస ఉంటుంది. నాలుగో రోజు కూనూర్ సైట్‌సీయింగ్‌కు తీసుకెళ్తారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత కూనూర్ బయలుదేరి అక్కడి అందాలను వీక్షిస్తారు. మధ్యాహ్నానికి ఊటీకి తిరిగి వచ్చి రాత్రి అక్కడే ఉండాలి. ఐదో రోజు ఉదయం టిఫిన్ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ నుంచి చెక్-ఔట్ చేయాలి. అక్కడి నుంచి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. మధ్యాహ్నం 3:40 గంటలకు 20630 నంబర్ శబరి ఎక్స్ ప్రెస్ లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ధర ప్రయాణ తేదీ, రైలు క్లాస్, రూమ్ ను ఎంతమంది షేర్ చేసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 22, 2026 వరకు 3AC కంఫర్ట్ ప్యాకేజీలో ట్రిపుల్ షేరింగ్ ధర ఒక్కొక్కరికి రూ.15,550గా ఉంది. ట్విన్ షేరింగ్ రూ.16,460, సింగిల్ షేరింగ్ రూ.28,730. అదే కాలానికి స్లీపర్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్ రూ.13,010, ట్విన్ షేరింగ్ రూ.13,920, సింగిల్ షేరింగ్ రూ.26,190గా ఉంది. సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 15 వరకు 3AC ట్రిపుల్ షేరింగ్ రూ.17,170, ట్విన్ షేరింగ్ రూ.18,890, సింగిల్ షేరింగ్ రూ.33,590. స్లీపర్‌లో ఈ ధరలు వరుసగా రూ.14,630, రూ.16,360, రూ.31,050గా ఉన్నాయి. డిసెంబర్ 22, 29 తేదీలకు ధరలు మరింత మారుతాయి. 3AC ట్రిపుల్ షేరింగ్ రూ.19,090, ట్విన్ రూ.20,810, సింగిల్ రూ.35,510. స్లీపర్‌లో ట్రిపుల్ రూ.16,550, ట్విన్ రూ.18,280, సింగిల్ రూ.32,970గా ఉన్నాయి.
బుకింగ్, ఇతర వివరాల కోసం సికింద్రాబాద్‌లోని IRCTC సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. 8287932229, 9701360701 నంబర్లలో కూడా సమాచారం పొందవచ్చు.
Read Also: జస్ట్ రూ. 95 వేలకే బాలి ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!