Sepehran Airlines plane: ఈ మధ్యకాలంలో విమానాలకు సంబంధించి రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. టేకాఫ్ తర్వాత జరుగుతున్న ఈ ఘటనలతో ప్రయాణికులు హడలిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఇరాన్‌లో చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో అందులోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది.
మంగళవారం సాయంత్రం ఇరాన్‌లోని మషద్ నుండి కెర్మాన్‌షాకు సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. రజావి ఖొరాసన్ ప్రావెన్స్ నివేదికల ప్రకారం.. టేకాఫ్ అయిన తర్వాత విమానం తన ల్యాండింగ్ గేర్ టైర్లలో ఒకటి ఊడిపోయింది. ఫలితంగా విమానం కుదుపులకు లోనైంది. అంతేకాదు ఇంజిన్ నుంచి భారీ చప్పుళ్లు రావడం మొదలైంది.
ఫలితంగా ప్రయాణికుల లగేజీ క్యాబిన్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో విమానం లోపల తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనతో పైలట్లు కంట్రోల్‌తో మాట్లాడారు. చివరకు విమానాన్ని అత్యవసరంగా మషద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు విభాగం, ఎయిర్ లైన్స్ సంస్థ దర్యాప్తుకు ఆదేశించాయి. టైర్ సమస్యతోపాటు ఇంజన్ దెబ్బతినడం వల్ల తీవ్రమైన ప్రకంపనలు తలెత్తాయని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. వైఫల్యానికి కచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
ఈ ఘటనలో విమానం లోపల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. విమానం క్యాబిన్ తీవ్రంగా కంపిస్తున్నట్లు కనిపించింది. పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికుల వైపు పడుతున్నట్లు కనిపించాయి. క్యాబిన్ పైకప్పు లైనింగ్‌లోని పెద్ద పెద్ద భాగాలు కింద పడ్డాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయంతో వణికిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. భయభ్రాంతులైన ప్రయాణికులు కొందరు అరుస్తూ, మరికొందరు ప్రార్థిస్తుండడం వంటి దృశ్యాలు ఉన్నాయి. క్యాబిన్ పైకప్పు నుండి పడుతున్న ముక్కల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నట్లు ఉంది.
ALSO READ: వావ్ అన్న వావ్.. ఇది బోగాపురం ఎయిర్‌పోర్ట్ కాదు, వినాయక మండపం!
భయంకరమైన ఫుటేజ్ వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫార్స్ వార్తా సంస్థ ప్రకారం.. సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి హసన్ జాఫరీ మాట్లాడారు. ప్రయాణికులు సురక్షితంగా దిగి తర్వాత కెర్మాన్‌షాకు వెళ్లే మరో విమానంలో తరలించినట్టు తెలిపారు. మషద్ విమానాశ్రయ రన్‌వేను పరిశీలన కోసం తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. కొన్ని గంట తర్వాత రన్‌వేను తిరిగి తెరిచారు.
🇮🇷 Wild cabin footage from an Iranian Sepehran Airlines Boeing 737 that had to turn back to Mashhad right after takeoff.
The tire tread came off during takeoff and damaged an engine on the flight to Kermanshah.
The crew declared an emergency, brought it around, and landed it…
— Mario Nawfal (@MarioNawfal) September 15, 2026