Bali Tour from Hyderabad: బాలి అందాలను చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, విమాన టికెట్లు, హోటల్, స్థానిక ప్రయాణం, ఫుడ్ లాంటి ఏర్పాట్ల కోసం విడివిడిగా బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటన హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. బాలి బీచ్‌లు, దేవాలయాలు, ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేసేలా ఈ టూర్‌ను రూపొందించారు.
IRCTC అందిస్తున్న ఈ బాలి టూర్ అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు నిర్ణయించిన సమయానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. రాత్రి 11:35 గంటలకు విమానం బయలుదేరుతుంది. పర్యటనలో బాలి రాజధాని డెన్‌పసార్‌కు రానుపోను విమాన ప్రయాణం ఉంటుంది. అక్కడ ప్రయాణికులకు త్రి స్టార్ హోటల్ లో వసతి కల్పిస్తారు.
ప్యాకేజీలో వసతితో పాటు భోజన సదుపాయం కూడా ఉంటుంది. నాలుగు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. ప్రయాణ సమయంలో రోజుకు రెండు వాటర్ బాటిళ్లు కూడా ఇస్తారు. బాలిలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏసీ డీలక్స్ బస్సును ఏర్పాటు చేస్తారు. మొత్తం టూర్ లో ఇంగ్లిష్ మాట్లాడే గైడ్ ప్రయాణికులకు సాయం చేస్తారు. టూర్ లో భాగంగా సందర్శించే ప్రాంతాలకు అవసరమైన ఎంట్రీ టికెట్లు కూడా ప్యాకేజీలోనే ఉంటాయి. దీంతో అక్కడికి వెళ్లిన తర్వాత ప్రతి ప్రదేశానికి ప్రత్యేకంగా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తో పాటు 2 శాతం TCS ఛార్జీని కూడా ప్యాకేజీలో చేర్చారు. నిబంధనలకు అనుగుణంగా TCS మొత్తాన్ని ఐటీ రిటర్న్ లో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రూమ్ ను ఎంత మంది షేర్ చేసుకుంటారనే దాని ఆధారంగా ప్యాకేజీ ధర మారుతుంది. ఒక వ్యక్తికి రూ.1,01,600 చెల్లించాలి. ఇద్దరు కలిసి ఒక గదిలో ఉంటే ఒక్కొక్కరికి రూ.95,900 అవుతుంది. ముగ్గురు కలిసి బస చేస్తే ఒక్కొక్కరికి రూ.95,500 ఖర్చవుతుంది. పిల్లలకు కూడా ప్రత్యేక ధరలు ఉన్నాయి. 2 నుంచి 11 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు బెడ్ తో ప్యాకేజీ ధర రూ. 89,050. బెడ్ లేకుండా ప్రయాణించే పిల్లలకు రూ. 85,500గా ఉంది.
ఈ టూర్‌లో బాలి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. జింబరన్ బీచ్, కింటామణి, ఉబుద్, తంజుంగ్ బెనోవా బీచ్, తాబేళ్ల ద్వీపం లాంటి ప్రదేశాలు పర్యటనలో ఉన్నాయి. అంతేకాకుండా, హోలీ మంకీ ఫారెస్ట్, తిర్తా ఎంపుల్ ఆలయం, తమన్ ఆయున్ ఆలయం, ఉలున్ దను బ్రతన్ ఆలయం, సముద్రం మధ్యలోని రాతి నిర్మాణంపై ఉన్న ప్రసిద్ధ తనాహ్ లాట్ ఆలయాన్ని కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది.
Read Also: తక్కువ ధరలో IRCTC కాశ్మీర్ టూర్.. ఫ్లైట్, హోటల్, ఫుడ్ అన్నీ అందులోనే!