IRCTC Ticket Booking With AI: రైలు టికెట్ బుక్ చేయాలంటే ఇప్పటి వరకు IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ లోకి వెళ్లి, రైలు వెతకడం నుంచి ప్రయాణీకుల వివరాలు ఎంటర్ చేయడం, పేమెంట్ పూర్తి చేయడం వరకు ఎన్నో స్టేజీలు దాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో టికెట్లకు డిమాండ్ పెరిగినప్పుడు ప్రతి క్షణం ఎంతో కీలకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఏఐ ఆటోమేటిక్ గా టికెట బుక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏఐతో టికెట్ బుకింగ్ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ చేసిన ప్రయోగంలో GPT-6 ఆస్ట్రా అనే ఏఐ మోడల్ ను ఉపయోగించి IRCTCలో రైలు టికెట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నించారు. కేవలం వినియోగదారుడి సూచనతో ఏఐ వెబ్ సైట్ లోని అన్ని దశలను దాటి టికెట్ బుకింగ్ చేసింది.
సదరు క్రియేటర్ GPT-6 ఆస్ట్రాను రెండు మూడు రోజుల పాటు పరీక్షించారు. ఈ సమయంలో కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కాకుండా, ఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన పనులను ఆటోమేటిక్ గా చేయగలదా అనే విషయాన్ని పరిశీలించారు. దీంట్లో భాగంగా IRCTCలో రైలు టికెట్ బుక్ చేసే ప్రక్రియను కూడా పరీక్షించారు. సాధారణంగా మనం చేసే విధంగానే రైలు వివరాలను గుర్తించడం, ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయడం, బుకింగ్ ప్రక్రియలో ముందుకు వెళ్లడం లాంటి పనులను ఏఐ చేయడానికి ప్రయత్నించింది.
ఈ ప్రయోగంలో భాగంగా ముంబై నుంచి రాజ్‌కోట్‌కు రైలు టికెట్ బుకింగ్ ప్రక్రియను ఏఐ పూర్తి చేసింది. ఫైనల్ రిజల్ట్ తనకే ఆశ్చర్యం కలిగించిందని సదరు క్రియేటర్ తెలిపారు. అయితే ఇది సోషల్ మీడియా క్రియేటర్ నిర్వహించిన పర్సనల్ టెస్టింగ్ మాత్రమే. ప్రతి వినియోగదారుడి విషయంలోనూ ఏఐ టికెట్‌ను విజయవంతంగా బుక్ చేస్తుందని నిర్ధారించలేం. ఇప్పటి వరకు ఏఐ అంటే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం అందించడం లాంటి పనులకే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు కొన్ని ఏఐ వ్యవస్థలు వినియోగదారుడి సూచనను అర్థం చేసుకుని వెబ్ లో అవసరమైన పనులు చేసేలా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో టికెట్ బుకింగ్, హోటల్ రిజర్వేషన్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి పనుల్లో వినియోగదారుల తరఫున ఏఐ కొన్ని దశలను పూర్తి చేసే అవకాశం ఉంటుంది
దీపావళి, ఛత్ వంటి పండుగల సమయంలో రైలు టికెట్లకు డిమాండ్ భారీగా ఉంటుంది. బుకింగ్ ప్రారంభమైన వెంటనే సీట్లు నిండిపోయే పరిస్థితుల్లో వేగంగా ప్రక్రియను పూర్తి చేయగల సాంకేతికత ఉపయోగకరంగా మారవచ్చు. అయితే, ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చినా వ్యక్తిగత వివరాలు, లాగిన్ సమాచారం, పేమెంట్స్ లాంటి అంశాల భద్రత చాలా ముఖ్యమైనవి. ఏఐకి ఒక పని అప్పగించే ముందు ఆ వ్యవస్థకు ఎలాంటి అనుమతులు ఇస్తున్నామో వినియోగదారులు తెలుసుకోవాలి.
Booking train on ChatGPT. pic.twitter.com/wt5HERnCtd
— India Live (@IndiaLiveIN) September 15, 2026
Read Also: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? సీటు కన్ఫర్మ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!