Bhogapuram Airport Lookalike Ganesh Pandal: విశాఖపట్నం పరిసరాల్లో వినాయక చవితి సందడి కన్నుల పండువగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే, వైజాగ్-భీమిలి రోడ్డులో పెద్ద ఉప్పాడ దగ్గర ఏర్పాటు చేసిన ఓ వినాయక మండపం అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటోంది. కారణం.. అది సాధారణ మండపం కాదు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోలిన విధంగా రూపొందించారు.
పెద్ద ఉప్పాడ దగ్గర ఏర్పాటు చేసిన ఈ గణేష్ పండల్‌ను చూస్తే మొదట నిజంగానే ఎయిర్‌పోర్ట్ అనిపించేలా ఉంది. ASR అంతర్జాతీయ విమానాశ్రయం ముందు భాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని డిజైన్, ఎంట్రెన్స్ ను అద్భుతంగా కనిపించేలా తీర్చిదిద్దారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మండపం బయట భాగం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దూరం నుంచి చూస్తే అసలు ఇది గణేష్ పండల్ అనే విషయం వెంటనే గుర్తించలేనంతగా డిజైన్ చేశారు. విమానాశ్రయ భవనం తరహాలో నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడికి వచ్చే వారంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ మండపం ప్రత్యేకత బయటితోనే ఆగిపోలేదు. లోపలి భాగాన్ని కూడా ఎయిర్‌పోర్ట్ థీమ్‌కు అనుగుణంగా రూపొందించారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగించేలా సెటప్ చేయడం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎయిర్‌పోర్ట్ డిజైన్‌ను చిన్న స్థాయిలో రీక్రియేట్ చేస్తూ, గణేష్ మండపానికి కొత్త లుక్ తీసుకొచ్చారు. దీంతో మండపాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఈ స్పెషల్ గణేష్ పండల్ గురించి జోరుగా చర్చ మొదలయ్యింది.
మండపం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఫౌంటెయిన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎయిర్‌పోర్ట్ తరహా నిర్మాణానికి ఈ నీటి కొలను మరింత అందాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు, పండల్‌లో స్థానిక సంస్కృతి, కళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఏటికొప్పక కళా సంప్రదాయం స్ఫూర్తితో రూపొందించిన విగ్రహం కూడా ఈ సెటప్ లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆధునిక విమానాశ్రయ రూపకల్పనతో పాటు స్థానిక వారసత్వాన్ని కలపడం ఈ మండపం మరింత ప్రత్యేకతను తెచ్చుకుంది.
ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో మండపాల నిర్వాహకులు కొత్త కొత్త ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సామాజిక అంశాలతో పాటు ప్రముఖ భవనాల నమూనాలతో కూడా పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో పెద్ద ఉప్పాడలో భోగాపురం విమానాశ్రయాన్ని గణేష్ పండల్‌గా మార్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూసిన నెటిజన్లు కూడా “వావ్.. ఇది ఎయిర్‌పోర్టా? గణేష్ మండపమా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!